Share News

సేవలకు సుస్తీ

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:47 PM

పేదల పాలిట సంజీవిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల(పెద్దాస్పత్రి). రాయలసీమ జిల్లాల నుంచే తెలంగాణ జిల్లాలకు సైతం ఆరోగ్య ప్రదాయిని.

   సేవలకు సుస్తీ
ఔషదశాల వద్ద మందులు కోసం బారులు తీరిన ప్రజలు

వేధిస్తున్న సిబ్బంది కొరత

సమయ పాలన పాటించని వైద్యులు

లోపించిన పారిశుధ్యం

వార్డులు సరిపోక వరండాలోనే వైద్యం

భద్రతను గాలికొదిలేసిన సెక్యూరిటీ ఏజెన్సీ

సదరంలో సర్టిఫికెట్ల కోసం పైసలు

నేడు హెచడీఎస్‌ సమావేశం

పేదల పాలిట సంజీవిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల(పెద్దాస్పత్రి). రాయలసీమ జిల్లాల నుంచే తెలంగాణ జిల్లాలకు సైతం ఆరోగ్య ప్రదాయిని. అలాంటి జీజీహెచకు సుస్తీ చేసింది. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. పారిశుధ్యం లోపించింది. సెక్యూరిటీ అధ్వానంగా తయారైంది. పెరిగిన రోగులకు అవసరమైన సౌకర్యాలు, వైద్యులు, సిబ్బందిని నియమించడంలో ప్రజాప్రతినిధులు, అధికా రులు విఫలమవుతున్నారు. కొందరు అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. సదరం క్యాంపులో దళారులదే హవా కొనసాగుతోంది. కొందరు ఉద్యోగుల సహకారంతో అనర్హులకు సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నేడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఏడు జిల్లాల పేదల పాలిట ఆరోగ్య సంజీవినిగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పేరొందింది. ఇలాంటి ఆస్పత్రి ప్రస్తుతం సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు 2వేల నుంచి 2,500 మంది ఓపీ రోగులు వచ్చేవారు. ఈ ఏడాది 3వేల నుంచి రూ.3,600 వరకు రోగుల సంఖ్య పెరిగింది. సెప్టెంబరు 28వ తేదీన రికార్డు స్థాయిలో 3,664 మంది ఓపీకి రాగా 236 మంది అడ్మిషన పొందారు. 1,176 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 21 కాన్పులు జరగ్గా.. మేజర్‌, మైనర్‌ ఆపరేషన్లు 316 జరిగాయి. ప్రతి మూడు నెలలకు ఓ సారి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ (హెచడీఎస్‌) సమావేశం జరగాల్సి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయ లోపంతో ఈసారి 8 నెలల తర్వాత గురువారం హెచడీఎస్‌ సమావేశం జరగనుంది

స్కానింగ్‌కు నరకయాతన

న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌కు స్కానింగ్‌ పరీక్షల కోసం గైనిక్‌, సర్జరీ, గ్యాస్ర్టో, యురాలజీ, మెడిసిన విభాగాలకు చెందిన రోగులు వస్తుంటారు. న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌కు ప్రతిరోజు 35 మంది, గైనిక్‌, ఐడీ రోగులు బెడ్‌సైడ్‌ రోగులకు మరో 150మందికి అల్ర్టాసౌండ్‌ పరీక్షలను వైద్యులు నిర్వహిస్తుంటారు. కొన్ని విభాగాల్లో వైద్యులు అనవసరంగా స్కానింగ్‌ పరీక్షలు రాయడంతో అత్యవసర రోగులకు ఈ పరీక్షలు అందని పరిస్థితి. రేడియాలజి విభాగం నిర్వహిస్తున్న కొత్త రెండు సిటీ స్కాన మిషన్లకు కేవలం నలుగురు ఎంఆర్‌ఐ టెక్నీషియన్లు ఉన్నారు. దీంతో పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. ఎక్స్‌రే టెక్నీషియన పోస్టులు నాలుగు ఖాళీగా ఉన్నాయి. స్కానింగ్‌ పరీక్షలతో పాటు రేడియాలజి వైద్యులు ఎఫ్‌ఎనఏసీ, ప్రొసిజర్స్‌, బయాప్పి, ఊపిరితిత్తుల్లో నీరు చేరిన వారికి ప్రొసిజర్స్‌ వల్ల వైద్యులు ఒత్తిడికి గురవుతు న్నారు.

సమయపాలన ఏదీ?

జీజీహెచలో కొందరు అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ (ఫేస్‌ రికగ్నిషన సిస్టమ్‌)ను చూడాల్సిన డ్రాయింగ్‌ అధికారి పట్టంచుకోక పోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలో ఓఅధికారికి ఇంతవరకు ఎఫ్‌ ఆర్‌ఎస్‌ లేకపోవడం విశేషం. కొందరు అధికారులు, సిబ్బంది ఉదయం 11గంటలకు వచ్చి మధ్యాహ్నం 1గంటకు ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రం 4గంటల తర్వాత వస్తున్నారు. అధికారుల పేరు చెప్పి కొందరు చిరుద్యోగులు సమయపాలన పాటించకుండా డ్రస్‌ కోడ్‌ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

భవనాలు లేక..

ఆస్పత్రిలోని రోగులకు పెద్ద కష్టమొచ్చింది. సర్జరీ, మెడిసిన వార్డులను ఐడీపీ కొత్త బ్లాక్‌ కోసం పగులకొట్టడంతో ఈ విభాగాల రోగులు సరిపడ భవనాలు లేక వరండాలో వైద్యం అందిస్తున్నారు. కొన్ని వార్డుల్లో మంచాల కొరత ఉంది. జనరల్‌ మెడిసిన విభాగాల్లో కొంత భాగం ట్రామాకేర్‌ భవనంలో సర్దుబాటు చేశారు. ఆరుబయట వరండాలో పడకలు వేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు.

పారిశుధ్యం, సెక్యూరిటీ అధ్వానం

జీజీహెచలో పారిశుధ్యం, సెక్యూరిటీ వ్యవస్థ అధ్వానంగా తయారైంది. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ప్రభుత్వం రోగుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ను తీసుకుంటుంది. ఇందులో చికిత్స పొం దుతున్న రోగులు పారిశుధ్యం బాగాలేదని ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తున్నా అధికారులు పూర్తిస్థాయి మార్కులు వేస్తుండటం గమనార్హం. ఆస్పత్రి ముందు భాగం అధికారులు ఉంటున్న ప్రాంతాల్లో పారిశుధ్యం బాగా ఉన్న వెనుక ఉన్న గైనిక్‌, చిన్నపిల్లలు, సర్జరీ, మెడిసిన, బూతబంగ్లాలో పారిశుధ్యం లోపించింది. ఎంసీహెచ ర్యాంప్‌ల వద్ద కంపు కొడుతోంది. ఎంసీహెచ భవనంలోనికి రోగుల సహాయకులు భోజనాలు చేస్తూ అక్కడ వ్యర్థాలు పడేస్తున్నా సెక్యూరిటీ సిబ్బంది దీన్ని అరికట్టలేకపోతుంది. సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకులకు 40మంది సిబ్బంది తక్కువగా ఉన్నారని అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల ఒత్తిడి మేరకు ఐదుగురిని నియమించి భద్రతను గాలికి వదిలేశారు. ఇంత జరుగుతున్నా సెక్యూరిటీ ఏజెన్సీకి అధికారులు మంచి మార్కులే వేస్తున్నారు.

దళారులదే హవా

సదరం క్యాంపులో దళారులదే హవా. కొందరు ఉద్యోగుల సహకారంతో అనర్హులకు సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అర్హులైన నిజమైన దివ్యాంగులకు కాకుండా డబ్బులు ఇచ్చిన వారికి సర్టిఫికెట్లు అందుతున్నాయి. ఇటీవల ఏసీబీ నుంచి ఓఉద్యోగిపై ఫి ర్యాదు రావడం కలకలం రేపింది. ఆస్పత్రిలోని ఓ ఏజెన్సీకి చెందిన ఓఉద్యోగి చక్రం తిప్పుతు న్నట్లు ఆరోపణలున్నాయి. అతడు సర్టిఫికెట్లు కోసం రూ.వేలు డబ్బులు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. .

ఫిల్మ్‌ల పేరుతో దోపిడీ

ఎంఆర్‌ఐ విభాగ బాధ్యతలను ప్రమోదిని సంస్థ ఏడేళ్లుగా నిర్వహిస్తోంది. ఆస్పత్రిలో ప్రతి రోజు దాదాపు 80ఎంఆర్‌ఐ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిల్మ్‌ల పేరుతో రోగుల నుంచి డబ్బులు వసూలు చేయరాదన్న నిబంధనను ప్రమోదిని సంస్థ తుంగలో తొక్కుతుంది. మొదట్లో ఒక్కోఫిల్మ్‌కు రూ.200, కొన్ని రోజుల తర్వాత రూ.250లు, ప్రసుత్తం రూ.300 ఫి ల్మ్‌ల పేరిట రోగుల నుంచి వసూలు చేస్తున్నారు. ఫిల్మ్‌ పేరుతో పేద రోగుల నుంచి డబ్బులు వసూలు చేయకుండా అరికట్టాల్సిన రేడియాలజి వైద్యులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

ఆగిన ఐపీడీ భవనం:

రెండేళ్లుగా ఆస్పత్రిలోని ఐపీడీ భవనం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. జనరల్‌ మెడిసిన, జనరల్‌ సర్జరీ, ఈఎనటీ, ఆర్థోపెడిక్‌, ఆపరేషన థియేటర్లలో సమస్యలతో వైద్యులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఐపీడీ భవనాన్ని పాక్షికంగానైనా పూర్తి చేసేందుకు కార్పొరేట్‌ సంస్థలను సంప్రదించి సీఎస్‌ఆర్‌ కింద నిధులు కేటాయించాలని కోరేందుకు ప్రజాప్రతి నిధులు, అధికారులు ప్రయత్నిస్తున్నా అది ముందుకు సాగడం లేదు.

మార్చురీలో సిబ్బంది కొరత

పెద్దాస్పత్రి మార్చురీలో సిబ్బంది కొరత వేధిస్తోంది. మార్చురీలో పోస్టుమార్టం నిర్వహణ సహాయక సిబ్బంది ఎంతో కీలకం. మృతదేహాలను ఎత్తడం, శుభ్రం చేయడం వంటి పనులను వారు చేయాల్సి ఉంటుంది. కేఎంసీలో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రిన్సిపాల్‌ ఇద్దరు సిబ్బందిని నియమించారు. మిగిలిన ఇద్దరు సిబ్బందిని నియమించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

సీసీబీ సేవలు ఎప్పుడు?

అత్యవసర రోగుల కోసం ఆయుష్మాన భారత కింద కర్నూలు జీజీహెచలోని న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌లో 50 పడకలతో రూ.23.75 కోట్లతో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌(సీసీబీ)ను సెప్టెంబరు 13న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు వర్చువల్‌లో ప్రారంభించారు. ఈబ్లాక్‌ను ఇంకా వెంటిలెటర్లు మరికొన్ని పరికరాలు రావాల్సి ఉంది. క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయోనని రోగులు ఎదురుచూస్తున్నారు.

నేడు హెచడీఎస్‌ సమావేశం

కలెక్టర్‌ ఏ.సిరి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టర్‌ కాన్ఫరెన్స హాలులో హెచడీఎస్‌(హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ) సమావేశం జరగనుంది. మంత్రి టీజీ భరత, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, హెచడీఎస్‌ సభ్యులు పాల్గొంటారు. ఆసుపత్రి అభివృద్దికి కొన్ని నిర్ణయాలు తీర్మాణం చేస్తాం.

ఫ డా.కే.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌, జీజీహెచ, కర్నూలు

Updated Date - Sep 30 , 2026 | 11:47 PM