సీనియర్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:46 AM
విద్యాహక్కు చట్టానికి సవరణ చేసి సీనియర్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఢిల్లీలో ఏపీటీఎఫ్ ధర్నా
అమరావతి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): విద్యాహక్కు చట్టానికి సవరణ చేసి సీనియర్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఏపీటీఎఫ్ ధర్నా నిర్వహించింది. ధర్నాలో వందల మంది టీచర్లు పాల్గొన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ శశికుమార్ ప్రసాద్ సింగ్ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మాట్లాడి టెట్ మినహాయింపు లభించేలా చూస్తామని ఎంపీ వారికి హామీ ఇచ్చారు. ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, కె.బసలలింగరావు మాట్లాడుతూ... ఇన్ సర్వీస్ టీచర్లంతా రెండేళ్లలోపు టెట్ ఉత్తీర్ణత సాధించాలని, లేనిపక్షంలో ఉద్యోగం కోల్పోతారని సుప్రీంకోర్టు తెలియజేసిందన్నారు. ఈ తీర్పుతో దేశంలో 30 లక్షల మంది టీచర్లు ప్రభావితం అవుతున్నారని, వారి భవిష్యత్తు ప్రమాదంలో పడిందని తెలిపారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న టీచర్లను ఇప్పుడు వారు బోధిస్తున్న సబ్జెక్టు, సంబంధం లేని సబ్జెక్టుల్లో పాస్ కావాలనే నిబంధన ఇబ్బందిగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే లక్ష మంది టీచర్లు ప్రభావితం అవుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి పార్లమెంట్‌లో విద్యాహక్కు చట్టం సవరణ చేయాలని డిమాండ్ చేశారు.