కల్యాణ వైభోగమే..
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:16 AM
విజయనగరం జిల్లాలోని చారిత్రక క్షేత్రం రామతీర్థం నీలాచల కొండ మీద కొలువుదీరిన శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం శుక్రవారం కన్నులపండువగా సాగింది.
సీతారాముల కల్యాణంతో పులకించిన రామతీర్థం
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
భారీగా తరలివచ్చిన భక్తులు
విజయనగరం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లాలోని చారిత్రక క్షేత్రం రామతీర్థం నీలాచల కొండ మీద కొలువుదీరిన శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం శుక్రవారం కన్నులపండువగా సాగింది. ‘ఉత్తర అయోధ్య’గా పేరుగాంచిన ఈ క్షేత్రంలో శ్రీరామ నవమి పర్వదినాన స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు తీసుకునిరాగా.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు స్వామివారికి సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో వేదపండితులు సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లం పెట్టారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య, మంగళవాయిద్యాలు హోరెత్తుతుండగా.. సీతమ్మ మెడలో రామచంద్రమూర్తి మాంగళ్యధారణ చేశారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ దంపతులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీరామనవమి పర్వదినం సమాజానికి ధర్మం, న్యాయం, సత్యం వంటి విలువలను చాటి చెబుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని రామరాజ్యంగా మారుస్తున్నారన్నారు. ఈ ఉత్సవాలకు రూ.20 లక్షలు విడుదల చేసి ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు.