Polavaram Project: పోలవరం ఎగువ కాఫర్ డ్యాంలో.. వేగంగా సీపేజీ జలాల కాలువ
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:46 AM
పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ జలాలను గోదావరి సహజ ప్రవాహంలోకి తరలించే కాలువ పనులు వేగవతంగా జరుగుతున్నాయి.
వారంలో పనులు పూర్తవుతాయన్న అధికారులు
పోలవరం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ జలాలను గోదావరి సహజ ప్రవాహంలోకి తరలించే కాలువ పనులు వేగవతంగా జరుగుతున్నాయి. ఎగువ కాఫర్ డ్యాం నుంచి వస్తున్న సీపేజీ జలాలను ఇప్పటివరకు దిగువ కాఫర్ డ్యాం వద్ద భారీ సామర్థ్యం ఉన్న మోటార్ల ద్వారా డీవాటరింగ్ చేస్తూ వచ్చారు. దీనివల్ల జరుగుతున్న కాలయాపన, అధిక వ్యయాన్ని అధిగమించేందుకు జలవనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దిగువ కాఫర్ డ్యాం వద్ద సీపేజీ జలాలు గోదావరి సహజ ప్రవాహంలోకి పోయేందుకు నిర్మించిన స్లూయిజ్ వరకు ఇటీవల ఎగువ కాఫర్ డ్యాం నుంచి కాలువ తవ్వకాలు ప్రారంభించారు. ఈ డ్యాంకు కుడివైపు గట్టు చివరి నుంచి స్లూయిజ్ వరకు కాలువ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే సీపేజీ జలాలను మోటార్ల ద్వారా డీవాటరింగ్ చేసే శ్రమ, వ్యయం కొంత మేర తగ్గడమే గాక ఆ నీరు గ్రావిటీ ద్వారా స్లూయిజ్‌లోకి అక్కడి నుంచి గోదావరి సహజ ప్రవాహంలో కలుస్తుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మరో వారం రోజుల్లో కాలువ తవ్వకం పనులు పూర్తవుతాయని చెప్పారు.