సీమ పంట పండింది!
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:08 AM
ప్రపంచంలోనే అతి పెద్ద పండ్ల తోటల ఉత్పత్తుల క్లస్టర్‌గా రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను తయారుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఉద్యాన క్లస్టర్‌గా రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలు: సీఎం
500 లక్షల టన్నుల ఉద్యాన ఉత్పత్తులే లక్ష్యం
ఇందుకోసం ఆయా జిల్లాల్లో 20కి పైగా పెండింగ్ నీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలి
ఏపీలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటుకు ‘డీపీ వరల్డ్’ రెడీ
జగన్ పడగొట్టిన పథకాలను నిలబెడదాం
ప్రాధాన్య ప్రాతిపదికన పూర్తిచేద్దాం
వెలిగొండ పథకాన్ని ఈ ఏడాదే పూర్తిచేయాలి
కొట్టుకుపోయిన ‘అన్నమయ్య’ పునర్నిర్మాణం
గాలేరు-నగరి ద్వారా కడప, కోడూరు వరకు నీళ్లు
గ్రామీణ రోడ్లు, లాజిస్టిక్స్ అభివృద్ధిపై దృష్టి
ఆర్థిక, జలవనరులు, వ్యవసాయం,
ఆర్‌అండ్‌బీ, పోర్టుల శాఖలతో సమీక్ష
అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అతి పెద్ద పండ్ల తోటల ఉత్పత్తుల క్లస్టర్‌గా రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను తయారుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దుబాయ్‌కు చెందిన డీపీ వరల్డ్ సంస్థ రాష్ట్రంలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చిందన్నారు. ఉద్యాన ఉత్పత్తుల్లో రాయలసీమ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్‌కు తగినట్లుగా 500 మెట్రిక్ టన్నుల ఉద్యానవన ఉత్పత్తులే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ఇందుకుగాను పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్టులను పూర్తి చేద్దామన్నారు. పది జిల్లాల్లో 20కిపైగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జల వనరుల శాఖను ఆదేశించారు. ఆ ప్రాజెక్టులను పూర్తిచేస్తే కొత్తగా 8.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని అధికారులు వివరించారు. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో ఉద్యానవనాభివృద్ధిపై మంగళవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. జగన్ హయాంలో పడగొట్టిన ప్రాజెక్టులను నిలబెడదామన్నారు. పూర్వోదయ, సాస్కి, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఇదే సమయంలో సీమ జిల్లాలతో పాటు.. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఉద్యాన సాగు విస్తీర్ణం పెంచుదాం..
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు అపారంగా పెరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. మొత్తం పది జిల్లాల్లో 301 క్లస్టర్లు, 303 మండలాల్లో ఉద్యానవన పంటలను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేశామని వెల్లడించారు. ఉద్యావన పంటల విస్తీర్ణాన్ని మూడేళ్లలో 8.41 లక్షల హెక్టార్ల నుంచి 14.41 లక్షల హెక్టార్లకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సీఎం స్పందిస్తూ.. రోడ్ల నెట్‌వర్క్, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు, పోర్టుల కనెక్టివిటీ, గోదాములు, కోల్డ్‌చైన్ తదితర లాజిస్టిక్స్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ‘పూర్వోదయ’ ద్వారా వచ్చే నిధులతో పాటు ఉద్యాన రంగంలో ప్రైవేటు పెట్టుబడులు రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధంచేయాలని ఆదేశించారు. సీమ ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర పథకాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయితే ఉత్తరాంధ్ర వరకు గోదావరి జలాలను తరలించవచ్చన్నారు.
పూర్తి చేసే 20కి పైగా ప్రాజెక్టులివే..
వెలిగొండ, కొరిశపాడు, పాలార్ డ్యాం, మల్లెమడుగు లిఫ్టు-జలాశయం,శ్రీబాలాజీ రిజర్వాయర్, కుప్పం బ్రాంచ్ కెనాల్, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, మూలపల్లి, హంద్రీ-నీవా ప్రధాన కాలువ, అల్తూరుపాడు-మేర్లపాక ఎస్‌ఎ్‌సఎల్‌సీ(సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్), నీవా బ్రాంచ్ కెనాల్, జీడిపల్లి-భైరవానితిప్ప లిఫ్టు, జీడిపల్లి-అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, అనంత మైక్రో కమ్యూనిటీ ఇరిగేషన్ ప్రాజెక్టు, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ, పేరూరు లిఫ్టు, కడప, రైల్వేకోడూరు వరకు గాలేరు-నగరి పనులు, అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ, వేదవతి ప్రాజెక్టు, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు, 7 జిల్లాల్లో 1,011 చిన్నసాగు చెరువుల అభివృద్ధి.
ఈ ఏడాదిలోనే వెలిగొండ పూర్తి
హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును కల్యాణి డ్యామ్ వరకూ విస్తరించాలని జల వనరుల శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పలు శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. పూర్వోదయకింద గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, జల వనరుల శాఖల ప్రాజెక్టులు చేపట్టడంపై సమీక్షించారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.2,041 కోట్ల నిధులు అవసరమని సీఎంకు మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు.