పెరగనున్న సీలేరు కరెంటు!
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:00 AM
ఆంధ్రప్రదేశ్ జలవిద్యుదుత్పత్తిలో సీలేరు పవర్ కారిడార్ కీలక భూమిక పోషిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్ 3962 మిలియన్ యూనిట్లు కాగా..
పవర్ కాంప్లెక్స్ స్థాపిత సామర్థ్యం 785 మెగావాట్లు
అక్టోబరుకల్లా మరో 230 మెగావాట్లు
లోయర్ సీలేరులో తుది దశలో 2 అదనపు యూనిట్ల పనులు
వీటితో 1015 మెగావాట్లకు చేరనున్న సామర్థ్యం
2025-26లో మొత్తం జలవిద్యుత్‌లో సీలేరు వాటా 40.81శాతం
అతి తక్కువ ఖర్చుతో ఉత్పాదన ఇక్కడ ప్రత్యేకత
యూనిట్ ఉత్పత్తి వ్యయం రూ.1.60 మాత్రమే
ఒక ప్లాంటు వాడుకుంటున్న నీటిని.. తర్వాత మిగతా కేంద్రాలూ వాడుకునే సౌలభ్యం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్ జలవిద్యుదుత్పత్తిలో సీలేరు పవర్ కారిడార్ కీలక భూమిక పోషిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్ 3962 మిలియన్ యూనిట్లు కాగా.. ఒక్క సీలేరు కాంప్లెక్స్ (మాచ్‌ఖండ్(ఏపీవాటా), అప్పర్ సీలేరు, డొంకరాయి, లోయర్ సీలేరు పవర్ ప్లాంట్లు) నుంచే 1617 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయింది. అంటే మొత్తం జల విద్యుదుత్పత్తిలో సీలేరు కాంప్లెక్స్ వాటా 40.81 శాతమన్న మాట. ఈ కాంప్లెక్స్‌లోని జల విద్యుత్కేంద్రాల ప్రస్తుత స్థాపిత సామర్థ్యం 785 మెగావాట్లు. త్వరలో మరో 230 మెగావాట్లు జత కానుంది. దీంతో స్థాపిత సామర్థ్యం 1015 మెగావాట్లకు చేరుకోనుంది. సీలేరు కాంప్లెక్స్ ప్రత్యేకత ఏమిటంటే.. మిగిలిన జలవిద్యుత్కేంద్రాలు సీజనల్ ఇన్‌ఫ్లోలపై ఆధారపడుతుంటాయి. కానీ ఇక్కడి కేంద్రాలు మాత్రం ఏడాది పొడవునా అందుబాటులో ఉండే నీటి ద్వారా విద్యుదుత్పత్తి చేస్తుంటాయి. ఇంకో విశేషం ఏమిటంటే.. ఇక్కడ ఒక ప్లాంటు నుంచి వదిలిన నీటిని మళ్లీ తదుపరి ప్లాంట్లలో వినియోగించుకుంటూ విద్యుదుత్పత్తి చేసుకునే సౌలభ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్-ఒడిసా రాష్ట్రాల నడుమ ప్రవహించే సీలేరు నదిని ఒడిసాలో మాచ్‌ఖండ్ అని పిలుస్తారు. గోదావరి నదికి ఉపనది అయిన శబరికి సీలేరు ఉపనది.
కొండకోనల్లో ఏడాది పొడవునా జలజలా పారే సీలేరు నది.. చూడడానికి సాదాసీదాగా ఉన్నా రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. జలవిద్యుదుత్పత్తికి ఈ నది వరప్రసాదం. సీలేరు నదిపై ఒడిసాలో మాచ్‌ఖండ్, బలిమెల వద్ద జలవిద్యుత్కేంద్రాలు ఉండగా.. మన రాష్ట్రంలో అప్పర్ సీలేరు, డొంకరాయి, లోయర్ సీలేరుల్లో ఉన్నాయి. ఈ మొత్తం పవర్ ప్రాజెక్టులను కలిపి సీలేరు పవర్ కారిడార్ అంటారు. ఏపీలోని జలవిద్యుత్కేంద్రాలను సీలేరు కాంప్లెక్స్‌గా పిలుస్తుంటారు.

అప్పర్ సీలేరు వద్ద పీఎస్‌పీకి పచ్చజెండా
అప్పర్ సీలేరు ప్రాజెక్టు అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీలేరు వద్ద ఉంది. ఇక్కడ 240 మెగావాట్ల ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. 1967-68లో తొలి రెండు యూనిట్లను ప్రారంభించారు. తర్వాత 1994-95లో మరో రెండు యూనిట్లను ప్రారంభించారు. అప్పర్ సీలేరు-డొంకరాయి నడుమ 1350 మెగావాట్ల సామర్థ్యంతో భారీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు(పీఎస్‌పీ)ను నిర్మించనున్నారు. ఒక్కోటీ 150 మెగావాట్ల సామర్థ్యం కల 9 రివర్సిబుల్ యూనిట్లు ఇక్కడ ఉంటాయి. సౌర, పవన్ విద్యుత్ ఎక్కువగా ఉండే పగటిపూట.. డొంకరాయి రిజర్వాయర్ నుంచి నీటిని ఎగువనున్న అప్పర్ సీలేరు ప్రాజెక్టుకు సంబంధించిన గుంటవాడ రిజర్వాయర్‌కు పంప్ చేస్తారు. విద్యుత్ డిమాండ్ ఉండే రాత్రి సమయంలో అదే నీటిని తిరిగి కిందకు వదిలి విద్యుదుత్పత్తి చేస్తారు. 2029 నాటికి దీనిని పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.
లోయర్ సీలేరులో మరో 230 మెగావాట్లు
లోయర్ సీలేరు ప్రాజెక్టు స్థాపిత సామర్థ్యం 460 మెగావాట్లు. డొంకరాయి రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని 15.6 కిలోమీటర్ల పవర్ కెనాల్ ద్వారా 0.143 టీఎంసీ లైవ్ స్టోరేజ్ సామర్థ్యం గల ఫోర్‌బేకు పంపుతారు. అక్కడి నుంచి నీటిని భూగర్భ సొరంగాలు, సర్ఫేస్ పెన్‌స్టాక్‌ల ద్వారా టర్బయిన్లకు పంపి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం 115 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 4 యూనిట్లు ఇక్కడ ఉన్నాయి. మొదటి రెండు యూనిట్లను సోవియట్ యూనియన్ లెనిన్ గ్రాడ్ మెటల్ వర్క్స్ నుంచి తీసుకొచ్చిన టర్బయిన్లతో ఏర్పాటు చేశారు. మిగిలిన రెండు యూనిట్లలో బీహెచ్‌ఈఎల్ తయారుచేసిన టర్బయిన్లు వాడారు. ప్రస్తుతం 115 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో రెండు యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు నాటికి వీటి నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇవి కూడా అందుబాటులోకి వస్తే లోయర్ సీలేరు సామర్థ్యం 690 మెగావాట్లకు చేరుతుంది.

డొంకరాయి ప్లాంటుకు 13 ఏళ్ల తర్వాత మరమ్మతులు
2012లో నిర్మితమైన డొంకరాయి పవర్ ప్లాంటుకు మొదటిసారిగా క్యాపిటల్ ఓవర్‌హాలింగ్ నిర్వహిస్తున్నారు. మే చివరి నాటికి పనులు పూర్తి చేసి.. ఈ 25 మెగావాట్ల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని పునఃప్రారంభించాలన్నది లక్ష్యం.
ఉత్పత్తి ఖర్చు తక్కువే..
సీలేరు కాంప్లెక్స్‌లో అతి తక్కువ ఖర్చుతో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1617 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. యూనిట్ విద్యుత్ ఉత్పత్తి సగటు ధర రూ.1.60 మాత్రమే కావడం గమనార్హం. లోయర్ సీలేరులో అదనపు యూనిట్ల నిర్మాణం కోసం సుమారు 50 రోజులపాటు ప్లాంటును షట్‌డౌన్ చేసినప్పటికీ రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేయడం మరో విశేషం.
సీలేరు పవర్ కారిడార్‌లోని జల విద్యుత్కేంద్రాలివీ..
మాచ్‌ఖండ్ ప్రాజెక్టు: సామర్థ్యం 120 మెగావాట్లు. ఇది ఒడిసా-ఏపీ ఉమ్మడి ప్రాజెక్టు. వాటా చెరి 60 మెగావాట్లు.
బలిమెల ప్రాజెక్టు: సామర్థ్యం 510 మెగావాట్లు. ఇది ఒడిసా ప్రభుత్వానిది.
అప్పర్ సీలేరు: సామర్థ్యం 240 మెగావాట్లు (60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్లు). ఇది ఏపీ ప్రభుత్వానిది.
డొంక రాయి: సామర్థ్యం 25 మెగావాట్లు. ఇది కూడా ఏపీ ప్రభుత్వానిదే.
లోయర్ సీలేరు: సామర్థ్యం 460 మెగావాట్లు (115 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్లు). ఇదీ ఏపీదే.