Share News

సీదిరి సీన్‌ రివర్స్‌

ABN , Publish Date - Jul 14 , 2026 | 04:28 AM

రోడ్డు ప్రమాదంలో నిరుపేద ప్రాణం పోవడానికి కారకుడైనతన కుమారుడిని చట్టం నుంచి తప్పించేందుకు మాజీమంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు ఆడిన నాటకం బట్టబయలైంది.

సీదిరి సీన్‌ రివర్స్‌

  • యాక్సిడెంట్‌ కేసులో బెడిసికొట్టిన డ్రామాలు

  • ఎట్టకేలకు వైసీపీ మాజీ మంత్రి కొడుకు అరెస్టు

  • బుల్లెట్‌ బైక్‌తో ఢీకొట్టడంతో గొర్రెల కాపరి మృతి

  • అనుచరుడిపై కేసు పెట్టించి, కుమారుడు ఆరవ్‌ను తప్పించేందుకు అప్పలరాజు పక్కా ప్లాన్‌

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో బయటపడ్డ నిజం

  • ఓ డ్రైవర్‌ సాక్ష్యం.. సీసీ ఫుటేజ్‌ ఆధారంతో గుట్టు రట్టు

  • దీంతో ఆరవ్‌ను పోలీసులకు అప్పగించిన సీదిరి

  • తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సీదిరిపైనా కేసు

శ్రీకాకుళం/పలాస, జూలై 13(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో నిరుపేద ప్రాణం పోవడానికి కారకుడైనతన కుమారుడిని చట్టం నుంచి తప్పించేందుకు మాజీమంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు ఆడిన నాటకం బట్టబయలైంది. వ్యవస్థలను తప్పుదారి పట్టించి, తన ప్రధాన అనుచరుడితో నేరం ఒప్పించాలని పన్నిన కుయుక్తులు బెడిసికొట్టాయి. వాస్తవాలను ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం సంచిక వెలుగులోకి తేవడంతో అధికార యంత్రాంగం, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేగింది. సాక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటపడటం, అన్ని దారులూ మూసుకుపోవడంతో, మాజీ మంత్రి తప్పనిసరి పరిస్థితుల్లో తన కుమారుడు ఆరవ్‌ వర్మ (19)ను సోమవారం పోలీసులకు అప్పగించారు. అతడిని అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించింది. దాంతో ఆరవ్‌ వర్మను అంపోలు జిల్లా జైలుకు తరలించారు. అలాగే, సీదిరి అనుచరుడిపైనా కేసు పెట్టి జైలుకు పంపించారు. యాక్సిడెంట్‌కు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యవహారంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపైనా కేసు నమోదుచేశారు. ఆ వివరాలు.. శుక్రవారం రాత్రి పలాసలోని జీఎంఈ జంక్షన్‌ సమీపంలోని పారిశ్రామికవాడ రోడ్డులో మాజీమంత్రి అప్పలరాజు పెద్దకుమారుడు ఆరవ్‌ వర్మ బుల్లెట్‌ ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా నడుపుతూ.. రోడ్డుపై వెళ్తున్న గొర్రెల కాపరి దుబ్బ దానయ్యను ఢీకొట్టాడు. బైక్‌ ఢీకొట్టిన దాటికి దానయ్య అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ప్రమాదంలో ఆరవ్‌ వర్మ కిందపడి ముఖం, ఇతర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆరవ్‌ వర్మ తన తండ్రికి ఫోన్‌ చేయగా.. అప్పలరాజు వెంటనే రంగంలోకి దిగారు.


గాయపడిన కుమారుడిని తన కారులో ఎక్కించుకుని చిన్నబాడం రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బైక్‌ స్కిడ్‌ అయిందని వైద్యుడికి అబద్ధం చెప్పి, ప్రథమ చికిత్స చేయించారు. ఆరవ్‌ వర్మ నీట్‌ పరీక్ష రాసి మెడికల్‌ సీటు కోసం వేచిచూస్తున్నారు. ఈ సమయంలో కేసు నమోదయితే తన కుమారుడికి భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో ఎవరికీ అనుమానం రాకుండా ఆరవ్‌ను విశాఖకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. దీనికోసం వేగంగా పావులు కదిపారు. కేసును పూర్తిగా పక్కదారి పట్టించేందుకు అప్పలరాజు తన వ్యూహాన్ని అమలు చేశారు. మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యురాలు సుజాతా త్యాడి కుమారుడు, తన ప్రధాన అనుచరుడు సిద్ధార్థను సీన్‌లోకి తెచ్చారు. ఘటనాస్థలంలోనే బైకును ఉంచి.. అక్కడ సిద్ధార్థ ఉన్నట్టు చిత్రీకరించారు. దానయ్యను ఢీకొట్టింది తానేనని సిద్ధార్థతో పోలీసుల వద్ద నమ్మబలికించారు. నిజాన్ని దాచిపెట్టేందుకు ఏకంగా ఆరుగురు వ్యక్తులను రంగంలోకి దింపారు. బాధిత కుటుంబ సభ్యులకు రూ. 1.5 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చి... కోర్టు వ్యవహారం తేలేక మరో7.5 లక్షలు చెల్లించేలా ‘పంచాయితీ’ చేసినట్టు సమాచారం.


డ్రైవర్‌ సాక్ష్యం..సీసీ ఫుటేజ్‌ ఆధారం..

ప్రమాదం జరిగిన సమయంలో అదే మార్గంలో వెళ్లిన ఓ లారీ డ్రైవర్‌.. ఆరవ్‌ వర్మ యాక్సిడెంట్‌ చేయడం ప్రత్యక్షంగా చూశాడు. మరోవైపు ‘ఆంధ్రజ్యోతి’ ఈ నిజాన్ని ఆదివారం ప్రధాన సంచికలో వెలుగులోకి తేవడం, టీడీపీ సోషల్‌ మీడియాలో దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో కేసు మలుపు తిరిగింది. పోలీసుల మొదట ఎటువంటి ఆధారాలు లేవని ప్రకటించారు. అయితే, విశాఖ ఐజీ గోపినాథ్‌ జెట్టి, శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో లోతైన దర్యాప్తు చేపట్టారు. దీంతో ‘రాజు’పై భక్తిని చాటుకునేందుకు కొంతమంది పోలీసులకు వీలుపడలేదు. రాత్రి9 గంటల నుంచి ఆరవ్‌ ఎక్కడెక్కడ తిరిగాడన్న దానిపై పోలీసులు ఆరా తీశారు. పాత జాతీయ రహదారిలో ఉన్న ఓ పెట్రోల్‌ బంకులో ఆరవ్‌ ఒక్కడే బుల్లెట్‌ బైక్‌పై వెళ్లి పెట్రోల్‌ వేయించుకుని, అదే రోడ్డులో వేగంగా వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత తన కుమారుణ్ణి డాక్టర్‌ దగ్గరకు అప్పలరాజు దగ్గరుండి తీసుకువెళ్లిన సీసీ ఫుటేజీ సోమవారం లభ్యమైంది. అన్ని దారులూ మూసుకుపోవడంతో మాజీ మంత్రి సీదిరి సోమవారం మధ్యాహం ఆరవ్‌వర్మను కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌లో సరెండర్‌ చేయించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిందితుడ్ని విచారించారు. ఆరవ్‌ వర్మ వద్ద ఎల్‌ఎల్‌ఆర్‌ మాత్రమే ఉంది. నిబంధనల ప్రకారం ఎల్‌ఎల్‌ఆర్‌ ఉన్నవారు బైక్‌ నడిపితే వెనుక పర్మినెంట్‌ లైసెన్స్‌ ఉన్న వ్యక్తి కూర్చోవాలి. ‘ఎల్‌’ బోర్డు ఉండాలి. ఆ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు.. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించకుండా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, వాస్తవాన్ని దాచిపెట్టి వేరొక వ్యక్తిని ఇందులో చేర్చినందుకు.. బీఎన్‌ఎస్‌ 105, 61(2), 106 (1) 49 రెడ్‌విత్‌ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కోర్టులో నేరం రుజువైతే పదేళ్లవరకుశిక్ష పడే అవకాశముంది.


బాధిత కుటుంబానికి టీడీపీ అండ..

పేద గొర్రెల కాపరి దానయ్య కుటుంబాన్ని సోమవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. దానయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అప్పలరాజుకు చట్టమంటే గౌరవం లేదా అని ఆగ్రహించారు.

Updated Date - Jul 14 , 2026 | 04:30 AM