రెండో భార్య పిల్లలకూ.. పూర్వీకుల ఆస్తిలో సమాన వాటా
ABN , Publish Date - Jun 28 , 2026 | 06:15 AM
మొదటి భార్య మరణానంతరం చట్టబద్ధంగా చేసుకున్న రెండో వివాహం తర్వాత జన్మించిన సంతానానికి పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తిలో సమాన హక్కులు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.
మొదటి భార్య మరణానంతరం చేసుకొనే వివాహానికి చట్టబద్ధత
రెండో భార్య పిల్లలను అక్రమ సంతానంగా చెప్పొద్దు
వారికీ ఆస్తిపై హక్కులు ఉంటాయి
ఓ కేసులో స్పష్టం చేసిన హైకోర్టు
అమరావతి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): మొదటి భార్య మరణానంతరం చట్టబద్ధంగా చేసుకున్న రెండో వివాహం తర్వాత జన్మించిన సంతానానికి పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తిలో సమాన హక్కులు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. రెండో భార్య పిల్లలను అక్రమ సంతానంగా ముద్రవేసి, ఆస్తిలో వాటా నిరాకరించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ఇటీవల ఓ కేసులో తీర్పు ఇచ్చారు. ప్రస్తుత కేసులో మొదటి భార్య చనిపోయిన తర్వాత రాఘవ అనే మహిళను పెళ్లి చేసుకున్నానని, ఆమె ద్వారానే కుమార్తెలు జన్మించారని స్వయంగా తండ్రి సోమరాజు చెబుతున్నారని కోర్టు గుర్తు చేసింది. రెండో భార్యకు పుట్టిన కుమార్తెలు చట్టబద్ధమైన సంతానం కాదని సోమరాజు మొదటి భార్య కుమారుడు సత్యనారాయణ వాదిస్తున్నప్పటికీ.. ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచలేదని పేర్కొంది. ఈ క్రమంలో పూర్వీకుల నుండి సోమరాజుకు సంక్రమించినఆస్తిని కుమారుడు సత్యనారాయణ, రెండవ భార్య రాఘవ, ఆమె కుమార్తెలకు సమాన వాటాలు కల్పిస్తూ కాకినాడ అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. మొదటి భార్య కుమారుడి అప్పీల్‌ను కొట్టివేసింది.
కేసు పుర్వాపరాలు ఏంటి?
కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడుకు చెందిన తురంగి సోమరాజుకు మొదటి భార్య ద్వారా సత్యనారాయణ జన్మించారు. మొదటి భార్య మరణానంతరం రాఘవ అనే మహిళను సోమరాజు రెండో వివాహం చేసుకోగా.. వారికి ఆరుగురు కుమార్తెలు జన్మించారు. పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తి విభజన కోసం సోమరాజు, కుమార్తెలు కలిసి కాకినాడ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 1998లో దావా వేశారు. కుమార్తెలు తన తండ్రికి చట్టబద్ధమైన సంతానం కాదని మొదటి భార్య కుమారుడు వాదించారు. అంతేకాకుండా తండ్రి సోమరాజు ఆస్తిపై హక్కులు వదులుకున్నారని, ఆస్తి మొత్తాన్ని తనకు రాస్తూ రెలింక్విష్‌మెంట్ డీడ్ చేశారని పేర్కొన్నారు. దీంతో ట్రయల్ కోర్టు దావాను కొట్టివేసింది. దీంతో సోమరాజు, కుమార్తెలు కాకినాడ జిల్లా కోర్టులో అప్పీల్ వేశారు. ఆ తర్వాత సోమరాజు మరణించడంతో ఆయన రెండో భార్య రాఘవ కోర్టు అనుమతితో వ్యాజ్యంలో ప్రతివాదిగా చేరారు. మొదటి అప్పీల్‌పై విచారణ జరిపిన కాకినాడ అదనపు జిల్లా కోర్టు మొదటి భార్య సంతానమైన సత్యనారాయణ, సోమరాజు రెండవ భార్య, కుమార్తెల ఆస్తిలో వాటాకు హక్కుదారులని తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సెకండ్ అప్పీల్‌పై హైకోర్టు ఇటీవల తుది విచారణ జరిపి నిర్ణయాన్ని వెల్లడించింది.
అయినా తండ్రి అలా చేయలేరు..
‘సోమరాజు, ఆయన కుమార్తెలు దావా వేయడానికి ముందు మొదటి భార్య కుమారుడు సత్యనారాయణకు లీగల్ నోటీసు పంపారు. ఆ నోటీసులు అందుకున్నప్పటికీ కుమార్తెల చట్టబద్ధతపై అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేయలేదు. రూ.80 వేలు తీసుకొని తన తండ్రి ఆస్తి మొత్తాన్ని తనకు రాసిచ్చారని సత్యనారాయణ చెబుతున్నారు. అయితే ఆస్తి బదలాయింపునకు సంబంధించిన రెలింక్విష్‌మెంట్ డీడ్‌ను ట్రయల్ కోర్టులో సాక్ష్యంగా ఉంచలేదు. ఒక వేళ ఆస్తి మొత్తం రాసిచ్చిన మాట వాస్తవమే అయినా.. పూర్వీకుల ఆస్తిలో తండ్రి తన అవిభక్త వాటాను మాత్రమే బదిలీ చేయగలరు. మిగిలిన వారసుల హక్కులను ఆయన హరించలేరు. కోర్టు ముందు ఉన్న సాక్ష్యాధారాలు, దస్త్రాలను పరిశీలించిన తర్వాతే సత్యనారాయణతో సమానంగా రెండో భార్య రాఘవ, కుమార్తెలకు పూర్వీకుల ఆస్తిలో సమాన వాటాలు దక్కుతాయని స్పష్టం చేస్తూ కాకినాడ అదనపు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సత్యనారాయణ సెకండ్ అప్పీల్‌ను కొట్టివేస్తున్నాం’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.