Share News

Fake Liquor Case: జోగి కుట్ర...జనార్దనరావు అమలు

ABN , Publish Date - Jan 18 , 2026 | 05:26 AM

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో 536 పేజీలతో ఎక్సైజ్‌ పోలీసులు రెండో చార్జిషీట్‌ను దాఖలు చేశారు.

Fake Liquor Case: జోగి కుట్ర...జనార్దనరావు అమలు

  • జోగి కుట్ర...జనార్దనరావు అమలు

  • ములకలచెరువు నకిలీ మద్యం కేసులో రెండో చార్జిషీట్‌ దాఖలు

అన్నమయ్య/ములకలచెరువు, జనవరి 17(ఆంధ్రజ్యోతి):రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో 536 పేజీలతో ఎక్సైజ్‌ పోలీసులు రెండో చార్జిషీట్‌ను దాఖలు చేశారు. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ ప్రేరణతోనే ములకలచెరువులో కూడా నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ప్రారంభించారని సిట్‌ అధికారులు, ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు గుర్తించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె జూనియర్‌ సివిల్‌ కోర్టులో దాఖలు చేసిన రెండో ప్రాథమిక చార్జిషీట్‌లో ఈ వివరాలను పొందుపరిచినట్లు సమాచారం. ఈ కేసులో గత నెల మొదటి వారంలో 540 పేజీలతో మొదటి ప్రాథమిక చార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన విషయం విదితమే. తాజాగా దాఖలు చేసిన రెండో చార్జిషీట్‌లో జోగి రమేశ్‌, జనార్దనరావు సోదరుల ఆర్థిక, స్నేహ బంధం గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. ఇద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, కాల్‌డేటా, ముడుపులు, యూపీఐ లావాదేవీలను చార్జిషీట్‌లో పొందుపరిచినట్లు సమాచారం. జోగి రమేశ్‌(ఏ32), జోగి రాము(ఏ33), అద్దేపల్లి జనార్దనరావు(ఏ1), అద్దేపల్లి జగన్‌మోహనరావు(ఏ26), కేరళకు చెందిన జిగ్నే్‌ష(ఏ24), శిబు(ఏ25), నకరికంటి రవి(ఏ16), శ్రీనివాసులు రెడ్డి(ఏ23) తదితరుల పాత్రను ప్రస్తావించినట్లు తెలిసింది. గతేడాది అక్టోబరు 3వ తేదీన ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్‌ పోలీసులు దాడి చేసి భారీఎత్తున నకిలీ మద్యం బాటిళ్లు, స్పిరిట్‌ క్యాన్లు, బ్లెండ్‌(నకిలీ మద్యం), అత్యాధునిక పరికరాలు స్వాధీనం చేసుకుని మొత్తం 33 మందిపై కేసు నమోదు చేశారు. తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జిగా ఉంటూ సస్పెండైన దాసరిపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి మినహా అందరూ అరెస్టయ్యారు.

Updated Date - Jan 18 , 2026 | 05:26 AM