మంత్రి భరత్ మాట తప్పారు
ABN , Publish Date - Jan 21 , 2026 | 04:14 AM
పారిశ్రామిక రాయితీల బకాయిలను సంక్రాంతిలోపు పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చిన మంత్రి టీజీ భరత్ మాట తప్పారని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ధ్వజం
ఇన్సెంటివ్స్ బకాయిల కోసం ఏపీఐఐసీ వద్ద ధర్నా
అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక రాయితీల బకాయిలను సంక్రాంతిలోపు పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చిన మంత్రి టీజీ భరత్ మాట తప్పారని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు విమర్శించారు. గత నాలుగు సంవత్సరాలుగా తమకు రావాల్సిన రాయితీలను విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ ధ్వజమెత్తారు. మంగళవారం రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఇన్సెంటివ్స్ బకాయిలు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత అక్టోబరులో నిధులు విడుదల చేసినప్పటికీ.. పరిశ్రమలశాఖ అధికారులు కొంతమందికి మాత్రమే చెల్లించారని, ఇంకా 50శాతం మందికి పైగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీ డబ్బులు చెల్లించలేదన్నారు. గత డిసెంబరులో ఏపీఐఐసీ ఎదుట ధర్నాకు దిగినప్పుడు... సంక్రాంతిలోపు ఇన్సెంటివ్స్ బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని మంత్రి భరత్ హామీ ఇచ్చారని, సంక్రాంతి వెళ్లిపోయినా మాట నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనార్‌బాబు, జాయింట్ సెక్రటరీ పెనుమాల నాగకుమార్, మహిళా నాయకురాళ్లు కారెం సత్యనారాయణమ్మ, పాలా నాగలక్ష్మి తదితరులు మాట్లాడుతూ... మంత్రి భరత్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోనందునే ధర్నాకు దిగాల్సివచ్చిందని తెలిపారు. సంఘ రాష్ట్ర నాయకులు జంగా త్రిమూర్తులు, చిన్న మౌలాలి, వరికూటి నీరజ, డాక్టర్ మద్దాల బిందు, కనపర్తి విజయరాజు, సరిహద్దు దయాకర్, కొడాలి రాంబాబు, జగదీష్, వి.భక్తవత్సలం తదితరులు ఈ ధర్నా కార్యక్రమానికి నాయకత్వం వహించారు.