ఎస్సీ - ఎస్టీ కోర్టు ఉత్తర్వుల్లో గందరగోళం
ABN , Publish Date - Mar 10 , 2026 | 05:52 AM
‘డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి అనంత లక్ష్మీ దుర్గపై రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయి.
అనంత లక్ష్మీ దుర్గ ముందస్తు బెయిలు పిటిషన్‌పై హైకోర్టు
అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ‘డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి అనంత లక్ష్మీ దుర్గపై రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలతో నివేదిక సమర్పించండి’ అని హైకోర్టు ఆదేశించింది. నివేదిక తెప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ-కోర్టు పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన ఉత్తర్వుల్లో ఓసారి సమన్లుగా, మరోసారి ఎన్‌బీడబ్ల్యూగా పేర్కొన్నారని తెలిపింది. దర్యాప్తు సంస్థ వేసిన సప్లిమెంట రీ చార్జ్‌షీట్ తమ ముందు ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు సూచించింది. లక్ష్మీ దుర్గ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయి దా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్ష్మీ దుర్గ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు.