నామినేషన్ల పరిశీలన పూర్తి
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:01 AM
ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన శనివారం పూర్తయింది. అన్ని పార్టీల అభ్యర్థుల ఆధ్వర్యంలో అధికారులు పత్రాలను పరిశీలించారు.
నేడు అప్పీల్‌కు అవకాశం
27న నామినేషన ఉపసంహరణ
బందోబస్తు నిర్వహించిన పోలీసులు
ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన శనివారం పూర్తయింది. అన్ని పార్టీల అభ్యర్థుల ఆధ్వర్యంలో అధికారులు పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని నామినేషన్లను తిరస్కరించారు. అభ్యంతరాలు ఉంటే ఆర్డీవోకు అప్పీల్ చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
పత్తికొండ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలకు 86నామినేషన్లు దాఖలు కాగా, నాలుగు తిరస్కరించినట్లు మండల రిటర్నింగ్ అధికారి శివరుద్రకుమార్ తెలిపారు. టీడీపీ-34, వైసీపీ-40, జనసేన-1, బీజేపీ-2, సీపీఐ-3, ఇండిపెండెంట్లు-2 మొత్తం 82 నామినేషన్లు ఆమోదించినట్లు వివరించారు. తిరస్కరణకు గురైన నామినేషన్లకు సంబంధించి అభ్యర్థులు తమ అనుమానాల నివృత్తికోసం ఆదివారం ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవచ్చన్నారు. 27న నామినేషన ఉపసంహరణ ఉంటుందని, అదేరోజు అభ్యర్థుల తుదిజాబితా ప్రకటిస్తామన్నారు. సమావేశంలో ఏఆర్వోలు కవిత, హుసేనసాహెబ్ ఉన్నారు.
మద్దికెర మండలంలో..
మద్దికెర: మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు దాదాపు 56 నామినేషన్లు దాఖలు చేయగా.. 14 తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మోహన విజయకుమార్ తెలిపారు. టీడీపీ 16, వైసీపీ 20, జనసేన 2, ఇండిపెండెంట్ 3, మొత్తం 42 నామినేషన్లు ఆమోదించినట్లు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గూండాల్ నాయక్, ఎంపీడీవో కేవీ నాగేంద్ర ప్రసాద్ ఉన్నారు.
తుగ్గలి మండలంలో..
తుగ్గలి: మండలంలో మొత్తం 17 ఎంపీటీసీలకు 77మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. అందులో ఒకటి మాత్రం తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శేషయ్య తెలిపారు.
దేవనకొండ మండలంలో..
దేవనకొండ: మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాలకు 117 మంది అభ్యర్థులు నామినేషన్ల పత్రాలు దాఖలు చేశారు. 116మంది అభ్యర్థుల పత్రాలను ఆమోదించినట్లు ఆర్వో తెలిపారు. ఒక అభ్యర్థిపత్రాలను పెండింగ్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. స్కూృటీని కేంద్రాన్ని ఆర్డీవో చిన్న ఓబులేసు, డీఎస్పీ వంశీధర్‌గౌడ్ తనిఖీ చేశారు.
ఆదోని 1,2 మండలాల్లో..
ఆదోని రూరల్/ఆదోని అగ్రికల్చర్: ఆదోని-1 మండలంలో 13 ఎంపీటీసీలకు గాను 79మంది, ఆదోని-2 మండలంకు సంబంధించి 17ఎంపీటీసీలకు గాను 98మంది నామినేషన్లు వేశారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉండడంతో ఆమోదించినట్లు ఎన్నికల అధికారులు పద్మనాభరెడ్డి, శ్రీలత, ఎన్నికల సహాయ అధికారులు నాగరాజు స్వామి, నాగరాజులు తెలిపారు. కాగా, జేసీ నూరుల్ ఖమల్ నామినేషన పరిశీలన కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆదోని-1, 2 మండలాలకు ఎన్ని నామినేషన్లు వచ్చాయని, ఎన్ని తిరస్కరించబడ్డాయని, ఇందులో పార్టీల వారిగా ఎన్నెన్ని వచ్చాయని ఆర్‌వోలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల పరిశీలనలో భాగంగా, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీ జయ శర్మ ఆధ్వర్యంలో సీఐలు నల్లప్ప, రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐలు రామాంజనేయులు, మహేష్ కుమార్, పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు.
ఆలూరు మండలంలో..
ఆలూరు: మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు 87మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 18 తిరస్కరణకు గురయ్యాయి. 69 మంది పత్రాలు ఆమోదించబడినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఆలూరు-3వ స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి నామినేషన్‌పై అభ్యంతరాలు ఉండడంతో ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
చిప్పగిరి మండలంలో..
చిప్పగిరి: మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన నామినేషన్ల పరిశీలన శనివారం ప్రశాంతంగా ముగిసింది. దాఖలైన నామినేషన్లన్నీ ఆమోదించబడ్డాయని రిటర్నింగ్ అధికారి రంగనాథ్‌బాబు తెలిపారు. శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా సీఐలు రవిశంకర్‌రెడ్డి, మస్తాన్వలి, నరసింహులు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
క్రిష్ణగిరి మండలంలో..
క్రిష్ణగిరి: మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలకు 35 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఆర్వో లక్ష్మీనారాయణ, ఏఆర్వోలు రాజేష్, మోహనకుమార్ ఎంపీటీసీ అ భ్యర్థులు వేసిన నామినేషన్లను పరిశీలించారు. పత్తికొండ ఆర్డీవో ఓబులేసు పర్యవేక్షించారు. ఎస్‌ఐ హనుమంతరెడ్డి బందోబస్తు నిర్వహించారు.
వెల్దుర్తి మండలంలో..
వెల్దుర్తి: మండల వ్యాప్తంగా 17 ఎంపీటీసీ స్థానాలకు 46 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకటి తిరస్కరణకు గురైనట్లు రిటర్నింగ్ అధికారి శ్రీదేవి, ఏఆర్వోలు చంద్రశేఖర్‌రెడ్డి, గురుస్వామి తెలిపారు.
ఆస్పరి మండలంలో..
ఆస్పరి: మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు గానూ 127 నామినేషన్లు దాఖలయ్యాయి. ఐదుగురు అభ్యర్థులు మాత్రం రెండుసార్లు నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని పత్రాలను ఆమోదించినట్లు ఆర్వో అధికారులు తెలిపారు.