ఉల్లి కోసం పరుగులు
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:27 PM
ఉల్లి కోసం కొందరు వ్యాపారులు రైతుల పొలాల వైపు పరుగులు పెడుతున్నారు.
పొలాల్లోనే రైతుల నుంచి వ్యాపారుల కొనుగోలు
స్పాట్ పేమెంట్.. భారీగా జీరో వ్యాపారం
బుధవారం కర్నూలు యార్డులో క్వింటా ఉల్లి రూ.4,913
ఆనందంలో ఉల్లి రైతులు
ఉల్లి కోసం కొందరు వ్యాపారులు రైతుల పొలాల వైపు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో ఉల్లి పంట సాధారణ సాగు విస్తీర్ణం 19,500 హెక్టార్లు కాగా, రైతులు మాత్రం ఐదు వేల హెక్టార్లలో మాత్రమే ఉల్లిని సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు పూర్తిగా ఉమ్మడి జిల్లాపై ప్రభావం చూపాయి. ఉల్లి కోసం వ్యాపారులు రైతుల వద్దకు వెళ్లి వారి వద్ద నుంచి డైరెక్ట్‌గా కొనుగోలు చేస్తున్నారు. అడ్వాన్సలు ఇచ్చి మరీ పంట దిగుబడులను బుక్ చేస్తున్నారు. దీంతో మార్కెట్ కమిటీల ఆదాయానికి గండి పడుతోంది. కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటా ఉల్లి రూ.4,900 ధర దక్కింది. ఉల్లికి డిమాండ్ పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
కర్నూలు అగ్రికల్చర్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఉల్లి కోసం వ్యాపారులు పరు గులు పెడుతున్నారు. ఉల్లి పంట ఎక్కడెక్కడ పండించారోనని వెతుకులాట ప్రారం భించారు. కొంత మంది వ్యాపారులు గ్రామాల్లో దళారులను ఏర్పాటు చేసుకుని ఉల్లి పండించిన రైతులను వారిద్వారా మచ్చిక చేసుకుని ఉల్లి కొనుగోలుకు ముందే అడ్వా న్సులు ఇచ్చేస్తున్నారు. దశాబ్ద కాలంగా ఎప్పుడూ వ్యాపారుల నుంచి ఇలాంటి స్పందన చూడలేదని, ఉల్లి రైతులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో ఉల్లి పంట సాధారణ సాగు విస్తీర్ణం 19,500 హెక్టార్లు కాగా, రైతులు మాత్రం ఐదు వేల హెక్టార్లలో మాత్రమే ఉల్లి పంటను సాగు చేశారు. ఎల్‌నినో ప్రభా వంతో వర్షాభావ పరిస్థితులు పూర్తిగా ఉమ్మడి జిల్లాపై ప్రభావం చూపాయి. ఈ కారణాల వల్ల ఎకరాకు 80 క్వింటాళ్ల దాకా దిగుబడి రావాల్సి ఉండగా.. 30 నుంచి 40 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి మాత్రమే వచ్చింది. మరో వైపు నీరు లేకపోవడం, ఎండలు మండిపోతుండటంతో గడ్డ కూడా లావు సైజుకు చేరలేదు. మహారాష్ట్రలో నాణ్యతలేని ఉల్లిగడ్డ రావడం కారణంగా ఉమ్మడి జిల్లా ఉల్లికి భారీ డిమాండ్ వచ్చి పడింది. ప్రస్తుతం క్వింటా ఉల్లికి గరిష్ఠంగా రూ.4,500 నుంచి రూ.5వేలకు చేరువలో ఉంది. మంగళవారం కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటా ఉల్లి రూ.4,900ల ధర దక్కింది.
ఉల్లి రైతులకు జాక్‌పాట్
కర్నూలు ఉల్లి రైతులకు జాక్‌పాట్ తగిలిందేమో అనిపిస్తుంది. కర్నూలు మార్కెట్ యార్డులో రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేసే వ్యాపారులు 40మంది దాకా ఉన్నారు. గత సంవత్సరం వరకు వీరిలో రైతుల నుంచి ఉల్లి కొనుగోలు కోసం పది మందికి మించి టెండర్ వేయలేని పరిస్థితి నెలకొంది. ఈసారి లైసెన్సు లేని వ్యాపారులు కూడా ఏయే గ్రామాల్లో రైతులు ఉల్లిని సాగు చేశారో తెలుసుకుని మరీ పొలాల వద్దకే వెళ్లి ఉల్లి కొనుగోలు కోసం రైతులకు అడ్వాన్సులు ఇస్తున్నారు. ఉల్లి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తామే దక్కించుకోవాలనే తాపత్రయంతో...
ఉమ్మడి జిల్లాలోని గోనెగండ్ల, సి.బెళగల్, గూడూరు, కోడుమూరు, కల్లూరు, ఎమ్మిగ నూరు, ఆలూరు, ఆదోనితో పాటు పాణ్యం, నందికొట్కూరు, క్రిష్ణగిరి, పత్తికొండ, డోన, వెల్దుర్తి, మిడుతూరు మండలాల నుంచి ప్రతిరోజు కర్నూలు మార్కెట్ యార్డుకు 3వేల క్వింటాళ్ల వరకు అమ్మకానికి తెస్తున్నారు. వ్యాపారులు ఉల్లిని రైతుల నుంచి తామే దక్కించుకోవాలనే తాపత్రయంతో పైన తెలిపిన మండలాల్లోని గ్రామాలకు వెళ్లి దళా రులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా రైతులను కలిసి ఇంకా పొలాల్లోనే ఉల్లి పంట అడ్వాన్సులు ఇస్తున్నారు. మార్కెట్ యార్డులకు మీరు ఉల్లిని తీసుకు రావాల్సిన అవసరం లేదని, మేమే వాహనాలను మీ పొలాల వద్దకు పంపుతామని, తూకం కాటాలను కూడా తీసుకువస్తామని నచ్చజెప్పి అడ్వాన్సులు కూడా ఇచ్చేస్తున్నారు.
సెస్సు ఆదాయానికి గండి
వ్యాపారులు రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తుండటంతో కర్నూలు జిల్లాలోని ఏడు, నంద్యాల జిల్లాలోని 8 మార్కెట్ యార్డులకు ఉల్లి అమ్మకాల ద్వారా రావాల్సిన సెస్సు ఆదాయానికి బారీగా గండి పడుతోంది. గ్రామాల్లో రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేశాక వ్యాపారులు ఉల్లిని వాహనాలను రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. ప్రతి రోజు ఉమ్మడి జిల్లా నుంచి 3వేల నుంచి 4వేల క్వింటాళ్లు చెక్‌పోస్టులను దాటించి దారి మళ్లిస్తున్నారు. కర్నూలు మార్కెటింగ్ శాఖ ఏడీఎం నారాయణమూర్తి మాట్లాడుతూ రెండు నెలల క్రితం ఈ-పర్మిట్ విధానాన్ని మార్కెటింగ్ శాఖ అమలులోకి తెచ్చిందని, మాన్యువల్ పద్ధతిలో సెస్సును చెక్‌పోస్టుల ద్వారా మార్కెట్ కమిటీల్లోని సిబ్బంది, అధికారుల ద్వారా వసూలు చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఈపర్మిట్ వల్ల సెస్సు ఆదాయానికి ఎటువంటి గండి పడదని ఏడీఎం తెలిపారు.
చెక్‌పోస్టుల్లో నిఘా పెంచాం
ప్రస్తుత ఖరీఫ్‌లో ఉల్లి సాగు భారీగా తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లా నుంచి రైతులు పెద్దఎత్తున కర్నూలు యార్డుకు ఉల్లిని తీసుకు వస్తున్నారు. ఉల్లి కోసం వ్యాపారులు కొన్నిచోట్ల గ్రామాలకు వెళ్లి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్నూలు మార్కెట్ కమిటీకి ఉల్లి క్రయవిక్రయాల ద్వారా అందాల్సిన సెస్సుకు గండి పడకుండా చర్యలు తీసుకున్నాం. చెక్‌పోస్టుల్లో నిఘా పెంచాం. మరో వైపు ప్రభుత్వం ఈ-పర్మిట్ విధానాన్ని అమలులోకి తీసుకురావడంతో రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసిన ఉల్లిని బయటకు పంపే క్రమంలో కచ్చితంగా ఈ-పర్మి ట్ కలిగి ఉండాలి.
ఫ జయలక్ష్మీ, సెలక్షన గ్రేడ్ సెక్రటరీ, కర్నూలు