ఇంటి వరండాలో పాఠశాల
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:27 PM
జీకే వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ పరిధిలోని గొర్లోవ గ్రామంలో ఎంపీపీ పాఠశాల గత పదేళ్లుగా ఇంటి వరండాలోనే కొనసాగుతోంది. పాఠశాల మంజూరైనప్పటి నుంచి సొంత భవనం లేకపోవడంతో గ్రామంలోని ఒక ఇంటి వరండాలో నిర్వహిస్తుండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
పదేళ్లుగా గొర్లోవ ఎంపీపీ పాఠశాల కొనసాగుతున్న వైనం
ఇబ్బంది పడుతున్న 84 మంది విద్యార్థులు
అధికారులకు వినతులు ఇస్తున్నా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రుల ఆవేదన
సీలేరు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జీకే వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ పరిధిలోని గొర్లోవ గ్రామంలో ఎంపీపీ పాఠశాల గత పదేళ్లుగా ఇంటి వరండాలోనే కొనసాగుతోంది. పాఠశాల మంజూరైనప్పటి నుంచి సొంత భవనం లేకపోవడంతో గ్రామంలోని ఒక ఇంటి వరండాలో నిర్వహిస్తుండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు అసౌకర్యానికి గురవుతున్నారు.
గొర్లోవ గ్రామానికి పదేళ్ల క్రితం ఎంపీపీ పాఠశాలను అధికారులు మంజూరు చేశారు. అయితే పాఠశాలకు కనీసం అద్దె భవనాన్ని కూడా కేటాయించలేదు. దీంతో ఆ గ్రామానికి చెందిన సీసీ రాజు అనే వ్యక్తి ఇంటి వరండాలో అప్పటి నుంచి పాఠశాల కొనసాగుతోంది. ఈ పాఠశాలలో కొల్తూరుకోట, చింతగొప్పు, పులిగొప్పు, కొత్త పాకలు గ్రామాలకు చెందిన 84 మంది విద్యార్థులు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదువుతున్నారు. వీరంతా వరండాలోనే ఇరుక్కుని కూర్చుంటున్నారు. మధ్యాహ్న భోజనం కూడా అక్కడే చేస్తున్నారు. ఈ పాఠశాలకు ఒక రెగ్యులర్ ఉపాధ్యాయుడు, ఒక వలంటీర్ మాత్రమే ఉన్నారు. పాఠశాలకు భవనం మంజూరు చేయాలని గత పదేళ్లుగా అధికారులకు వినతులు ఇస్తూనే ఉన్నామని విద్యార్థుల తల్లిదండ్రులు సీసా రాజు, ఫాంగి భగత్‌రామ్, ఫాంగి గాసీరా ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పాఠశాలకు భవనం మంజూరు కాలేదని వాపోతున్నారు. ప్రస్తుతం పాఠశాల కొనసాగుతున్న ఇంటి వరండా గోడలు కూడా శిథిలావస్థలో ఉన్నాయని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉందని వారు తెలిపారు. ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించి పాఠశాలకు భవనం మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.