Bapatla District: చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు
ABN , Publish Date - Jan 03 , 2026 | 05:09 AM
అంగన్‌వాడీకి వెళ్లే ఐదేళ్ల చిన్నారి స్కూల్ బస్సు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చూసిన కన్నతల్లి కుప్పకూలింది.
బాపట్ల జిల్లా ఇంకొల్లులో విషాదం.. అతి వేగమే ప్రాణం తీసింది!
తల్లిడిల్లిపోయిన తల్లిదండ్రులు
ఇంకొల్లులో చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు
ఇంకొల్లు, జనవరి 2(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీకి వెళ్లే ఐదేళ్ల చిన్నారి స్కూల్ బస్సు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చూసిన కన్నతల్లి కుప్పకూలింది. బాపట్ల జిల్లా ఇంకొల్లు ఎన్‌ఎ్‌సఎల్ టెక్స్‌టైల్స్‌లో శుక్రవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు స్కూల్ బస్సు వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన పాంగి రమేశ్, పుణ్యవతి కొన్నేళ్లుగా ఇంకొల్లు ఎన్‌ఎ్‌సఎల్ నూలు మిల్లులో పనిచేస్తున్నారు. కంపెనీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు... మణికంఠ, ఓంకార్. ఐదేళ్ల ఓంకార్ టిఫిన్ కోసం ఉదయం నూలు మిల్లు ఆవరణలోని క్యాంటిన్ వద్దకు వెళ్లాడు. టిఫిన్ తీసుకొని ఇంటికి వస్తున్న సమయంలో పిల్లలను ఎక్కించుకునేందుకు లోపలికి వచ్చిన ఓ ప్రైవేటు స్కూల్ బస్సు కిందపడి మృతి చెందాడు. సీఐ వైవి.రమణయ్య, ఎస్సై సురేశ్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపారు.