పాస్టర్ ఆనంద్‌కు మళ్లీ నోటీసులు
ABN , Publish Date - May 04 , 2026 | 05:05 AM
పాస్టర్ ఆనంద్‌కు ఎస్సీ హోదా రద్దు చేయాలని కోరుతూ జిల్లా స్థాయి స్ర్కూటినీ కమిటీ ( డీఎల్‌ఎస్‌సీ) చైర్మన్, జాయింట్ కలెక్టర్ భావన బాపట్ల జిల్లా కలెక్టర్‌కు సిఫారసు చేశారు.
ఎస్సీ హోదా రద్దుకు డీఎల్‌ఎస్‌సీ సిఫారసు
ఈ నెల 19న తుది నిర్ణయం.. అభ్యంతరాలకు 15 రోజుల గడువు
బాపట్ల కలెక్టర్ వినోద్‌కుమార్ వెల్లడి
బాపట్ల, మే 3 (ఆంధ్రజ్యోతి): పాస్టర్ ఆనంద్‌కు ఎస్సీ హోదా రద్దు చేయాలని కోరుతూ జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ ( డీఎల్‌ఎస్‌సీ) చైర్మన్, జాయింట్ కలెక్టర్ భావన బాపట్ల జిల్లా కలెక్టర్‌కు సిఫారసు చేశారు. దీని ఆధారంగా కలెక్టర్ వినోద్‌కుమార్ పాస్టర్‌కు మరోసారి నోటీసులిచ్చారు. పారదర్శకత కోసం ఆ ప్రతిని పిటిషనర్ అక్కల రామిరెడ్డికి కూడా పంపించామని కలెక్టర్ ఆదివారం వెల్లడించారు. అధికారిక ప్రక్రియ ప్రకారం.. నోటీసులు జారీ చేసిన నాటి నుంచి అభ్యంతరాలకు 15 రోజులు గడువు ఉంటుందని, ఏమైనా ఉంటే పాస్టర్ ఆనంద్ ఈలోపు తనకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని.. డాక్యుమెంట్లు ఉన్నా అందించవచ్చని ఆయన తెలిపారు. ఈ నెల 19న తుది నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు. పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు వివాదంలో డీఎల్‌ఎ్‌ససీ తుది విచారణ మే 1న బాపట్ల జిల్లా కలెక్టరేట్ వేదికగా జరిగింది. ఇరుపక్షాల వాదనలను కమిటీ రికార్డు చేసింది. ఏప్రిల్ 18న జరిగిన తొలి విచారణకు హాజరుకాని పాస్టర్ ఆనంద్.. తుది విచారణకు వచ్చారు. మతం మారితే ఎస్సీ హోదా వర్తించదన్న రాష్ట్ర హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో కమిటీ సిఫారసులకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే తుది విచారణ జరిగిన రెండ్రోజుల వ్యవధిలోనే పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేయాలని కమిటీ కలెక్టర్‌కు సిఫారసు చేసింది.