నేను పుట్టుకతో ఎస్సీని!
ABN , Publish Date - May 20 , 2026 | 04:17 AM
పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు వ్యవహారం లో విచారణ ముగిసింది. బాపట్ల కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన విచారణ కు ఆనంద్ హాజరై తన వాదన వినిపించారు.
విశ్వాసమే మార్చుకున్నా.. కలెక్టర్ తుది విచారణలో పాస్టర్ ఆనంద్ వివరణ
బాపట్ల, మే 19(ఆంధ్రజ్యోతి): పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు వ్యవహారం లో విచారణ ముగిసింది. బాపట్ల కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన విచారణ కు ఆనంద్ హాజరై తన వాదన వినిపించారు. ఆయన తరఫు లాయర్ దాదాపు 72 పేజీల డాక్యుమెంట్లను కలెక్టర్‌కు అందించారు. తాను పుట్టుకతోనే ఎస్సీనని, విశ్వాసాన్ని మాత్రమే మార్చుకున్నానని, కులాన్ని కాదని ఆనంద్ వివరించారు. దీంతోపాటు కుల ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్‌కు ఇచ్చారు. అయితే, ఫిర్యాదిదారుడు అక్కల రామిరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్న పలు అంశాలతో పాటు స్ర్కూటినీ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలపై కలెక్టర్ వివరణ కోరినట్లు సమాచారం. ఇవే కాకుండా హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారని తెలిసింది. ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందని, తాను తీసుకునే తుది నిర్ణయంపై ఏవైనా అభ్యంతరాలుంటే సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖలో అప్పీల్ చేసుకోవచ్చని ఆనంద్‌కు కలెక్టర్ సూచించినట్లు సమాచారం. కాగా, తదుపరి ప్రక్రియపై కలెక్టర్ స్పందిస్తూ.. డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఎస్సీ హోదాపై 48 గంటల్లో తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న జిల్లా స్థాయి స్ర్కూటినీ కమిటీ ఈ నెల 1న జరిపిన విచారణకు పాస్టర్ ఆనంద్‌తో పాటు పిటిషనర్ అక్కల రామిరెడ్డి కూడా హాజరయ్యారు. ఇరు పక్షాల వాదనలను విన్న కమిటీ ఆనంద్ ఎస్సీ హోదా రద్దుకు సిఫారసు చేస్తూ మే 2న కలెక్టర్ వినోద్‌కుమార్‌కు నివేదిక అందించింది. నిబంధనల ప్రకారం తన వాదన చెప్పుకోవడానికి పాస్టర్ ఆనంద్‌కు కలెక్టర్ మరో అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గడువు చివరి రోజైన మంగళవారం ఆనంద్ తన లాయర్‌తో వచ్చి వివరణ ఇచ్చారు. మరోవైపు, స్ర్కూటినీ కమిటీ ఇచ్చిన నివేదకకే కలెక్టర్ ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిసింది.