Share News

‘ఎస్సీ హోదా’ రద్దుపై నేడు తుది విచారణ

ABN , Publish Date - May 01 , 2026 | 04:16 AM

పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దు అంశంపై శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్‌ వేదికగా తుది విచారణ జరగనుంది. ఏప్రిల్‌ 18నే తొలి విచారణ జరగ్గా, నేడు జరిగేదే చివరిదని కమిటీ చైర్మన్‌...

‘ఎస్సీ హోదా’ రద్దుపై నేడు తుది విచారణ

  • తొలి విచారణకు హాజరు కాని పాస్టర్‌ ఆనంద్‌

బాపట్ల, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దు అంశంపై శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్‌ వేదికగా తుది విచారణ జరగనుంది. ఏప్రిల్‌ 18నే తొలి విచారణ జరగ్గా, నేడు జరిగేదే చివరిదని కమిటీ చైర్మన్‌, జాయింట్‌ కలెక్టర్‌ భావన తెలిపారు. క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా వర్తించకపోవడంతో పాటు వారు పెట్టే అట్రాసిటీ కేసు కూడా చెల్లదని గతేడాది ఏప్రిల్‌ 30న హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చి 24న సమర్థించింది. అయితే హైకోర్టు విస్పష్టంగా తీర్పునిచ్చినా కూడా ఎస్సీ హోదా రద్దుపై తాత్సారం జరుగుతోందని పిటిషనర్‌ అక్కల రామిరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్‌ 24న విచారణ జరగ్గా, తదుపరి విచారణ జూన్‌ 16కు వాయిదా పడింది. వీటన్నింటి మధ్య జేసీ సారథ్యంలోని స్ర్కూటినీ కమిటీ ఎస్సీ హోదా రద్దుపై శుక్రవారం తుది విచారణ జరపనుంది. ఏప్రిల్‌ 18న జరిగిన తొలి విచారణకు పాస్టర్‌ ఆనంద్‌ హాజరు కాలేదు. శుక్రవారం జరిగే విచారణకు ఆయన హాజరై తన వాదనను కమిటీ ముందు వినిపిస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ విచారణ పూర్తయిన తర్వాత కమిటీ తీసుకునే నిర్ణయం కలెక్టర్‌ వద్దకు చేరనుంది. ఆయన దానిని పరిశీలించి రూల్‌ ప్రొసీజర్‌ ప్రకారం నిర్ణయం తీసుకోనున్నారు. అయితే తుది నిర్ణయం వెలువడడానికి కనీసం ఇంకో నెల రోజులు పట్టే అవకాశం ఉందని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది.

Updated Date - May 01 , 2026 | 04:16 AM