Share News

ఎస్సీలు మతం మారితే హోదా పోదు

ABN , Publish Date - May 03 , 2026 | 04:30 AM

షెడ్యూల్‌ కులాలకు చెందినవారు మతం మారినంత మాత్రాన వారి సామాజిక పరిస్థితులు, హోదా ఎక్కడా మారదని ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

ఎస్సీలు మతం మారితే హోదా పోదు

  • అగ్రవర్ణానికో న్యాయం..మాకో న్యాయమా?

  • చంద్రబాబు దృష్టికి రఘురామ వ్యవహారం: మందకృష్ణ మాదిగ

భీమవరం టౌన్‌, మే 2(ఆంధ్రజ్యోతి): షెడ్యూల్‌ కులాలకు చెందినవారు మతం మారినంత మాత్రాన వారి సామాజిక పరిస్థితులు, హోదా ఎక్కడా మారదని ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ‘రాజ్యాంగం ఎస్సీలకు కల్పించిన సామాజిక స్థితి’పై జరిగిన అవగాహన సదస్సులో శనివారం ఆయన మాట్లాడారు. ‘‘షెడ్యూల్‌ కులాల వారు క్రైస్తవమో మరొక మతమో తీసుకున్నంత మాత్రాన వారి సామాజిక హోదా, గౌరవం ఎక్కడా పెరగదు. ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్లు పొందలేరని, ఎస్సీ హోదా ఉండదని సుప్రీంకోర్టు చెప్పడం రాజ్యాంగ విరుద్ధం. కులం, కుల వివక్ష ఉన్నంత కాలం ఎస్సీ, ఎస్టీ, ఇతరులకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. ఆర్టికల్‌ 25.. ఏదైనా మతాన్ని, దైవాన్ని పూజించుకునే హక్కు, ప్రచారం చేసుకునే హక్కు కల్పించింది. కులవ్యవస్థ ఉన్నంతకాలం సామాజిక గుర్తింపులో అంతరాలు, ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి. దళితులకు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగడానికి, కల్పించడానికి జాతీయస్థాయిలో ఉద్యమాన్ని ప్రారంభించాం. దీనికి చెందిన వారందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువస్తున్నాం. అగ్రవర్ణాల వారు తమ మత ప్రచారం చేసుకుంటారు. వారికి ఎక్కడా అభ్యంతరాలు లేవని, హక్కుగా చెప్పుకొంటున్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న ఎస్సీలను ఈనాటికీ వివక్షతోనే చూస్తున్నారు. అగ్రవర్ణాలకు ఈబీసీ కోటా కింద రిజర్వేషన్లు వస్తూ ఉంటే ఎస్సీలను ఎస్సీ హోదా లేకుండా ఉండాలని కోరడం దారుణం’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు దళితులు, దళిత క్రైస్తవులు, క్రైస్తవులను అవమానించే విధంగా ఉన్నాయి. అవహేళన చేసే విధంగా ఉన్నాయి. ఆయన చేష్ఠలు, మాటలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన వ్యవహార శైలి, ఇక్కడ జరుగుతున్న ఘటనలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళతాం. ఆయన చేస్తున్న పనులు టీడీపీకి, చంద్రబాబుకు దళిత సమాజాన్ని దూరం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వానికి నష్టం కలిగిస్తాయి. ఆయనపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.’’ అని మంద కృష్ణమాదిగ అన్నారు.

Updated Date - May 03 , 2026 | 04:31 AM