హైకోర్టు రహస్య నివేదికలోని వ్యాఖ్యలను తొలగించలేం
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:22 AM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్)లో నమోదు చేసిన ప్రతికూల వ్యాఖ్యలను తొలగించడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
ఏపీ న్యాయాధికారికి సుప్రీం కోర్టులో నిరాశ
న్యూఢిల్లీ, జూన్ 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్)లో నమోదు చేసిన ప్రతికూల వ్యాఖ్యలను తొలగించడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. తనపై వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఒక న్యాయాధికారి దాఖలు చేసిన పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఎన్.విజయ్ బాబు అనే న్యాయాధికారి 2008లో జూనియర్ సివిల్ జడ్జిగా విధుల్లో చేరారు. ఆయన సర్వీసులో చేరిన తొలి ఏడాదే(2009 సంవత్సరానికి గాను) ఏపీ హైకోర్టు వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్)లో తీవ్ర ప్రతికూల వ్యాఖ్యలు నమోదు చేసింది. ఆయన పనితీరు సగటుగా ఉందని, నిబద్ధత అనుమానాస్పదంగా ఉందని, న్యాయపరమైన విధానం అస్థిరంగా ఉందని ఆ నివేదికలో పొందుపరిచింది. అప్పట్లో బైక్ ప్రమాదానికి గురై ఒకరు మరణించిన కేసు, అలాగే ఆయన ప్రవర్తనపై వచ్చిన కొన్ని ఆరోపణల ఆధారంగా హైకోర్టు ఈ రిమార్కులు రాసింది. అయితే, ఆ తర్వాత జరిగిన శాఖాపరమైన విచారణలో ఆ ఆరోపణలేవీ రుజువు కాకపోవడంతో ఆయనకు పూర్తిస్థాయిలో క్లీన్ చిట్ లభించింది. ఆరోపణల నుంచి విముక్తుడైనందున పాత ప్రతికూల వ్యాఖ్యలను తొలగించాలని ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఉపశమనం దొరకకపోవడంతో చివరికి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ సోమవారం సీజేఐ, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
ఆరోపణల ఆధారంగా రిమార్కులు రాశారు..
అప్పట్లో కేవలం ఆరోపణల ఆధారంగానే ఏసీఆర్‌లో రిమార్కులు రాశారని, ఇప్పుడు ఆ ఆరోపణలు వీగిపోయినందున రిమార్కులను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ఏకపక్షంగా రాసిన ఈ రిమార్కుల వల్ల ఒక యువ న్యాయాధికారి భవిష్యత్తు దెబ్బతింటోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఒక న్యాయాధికారిపై వచ్చే సాధారణ ఫిర్యాదులు, కోర్టు వర్గాల్లో వారికున్న పేరు ప్రఖ్యాతుల ఆధారంగా కూడా ఏసీఆర్‌లలో వ్యాఖ్యలు రాస్తారని, ప్రతిదానికీ నేరుగా ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదని సీజేఐ అన్నారు. అప్పట్లో తనిఖీలకు వెళ్లిన జిల్లా జడ్జి లేదంటే అడ్మినిరేస్టటివ్ జడ్జిలు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇవన్నీ పరిశీలిస్తే, హైకోర్టు ఏమాత్రం కక్షపూరితంగా వ్యవహరించలేదని పేర్కొంది.