ఊరి బడిని కాపాడుకుందాం
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:28 AM
బడి ఈడు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం కృషి చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు కోరారు.
బడి అంటే నాలుగు గోడలు, పరీక్షలు, ర్యాంకులే కాదు
పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతాం
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు భరోసా
విజయవాడ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): బడి ఈడు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం కృషి చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు కోరారు. విజయవాడలోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, బడి అంటే ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాలుగు గోడలు, సిలబస్, పరీక్షలు, ర్యాంకులు మాత్రమే కాదని చుట్టూ సమాజం కూడా ఉంటుందని అన్నారు. సమాజ అవసరాలను తీర్చగలిగే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నేర్పాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, దేశభక్తి, సమానత్వ భావన అలవడతాయని చెప్పారు. ఫిబ్రవరి 1, 8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌స.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం చొరవ చూపకపోతే రానున్న ఐదేళ్లలో పాఠశాలల సంఖ్య మరింత తగ్గే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.