Share News

బాలుడి హంతకుడిపై కాల్పులు

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:10 AM

బాలుణ్ణి క్రూరంగా హత్యచేసిన హంతకుడు పోలీసులపైనా అదే జులుం ప్రదర్శించాడు. చేతికి దొరికిన ఖాళీ బీర్‌ బాటిల్‌తో దాడి చేసి, వారినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.

బాలుడి హంతకుడిపై కాల్పులు

  • సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా పోలీసులపై తిరగబడ్డ సర్వేశ్‌

  • ఖాళీ బీర్‌ బాటిల్‌తో పోలీసులపై దాడి

  • సీఐ, కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు.. తప్పించుకునే యత్నం

  • ఆరు రౌండ్లు కాల్చిన పోలీసులు

  • తూటా గాయాలతో పట్టుబడ్డ సర్వేశ్‌

  • కాల్పుల వార్తతో పండగ చేసుకున్న అనంతపురం జిల్లా యాడికి వాసులు

తాడిపత్రి/యాడికి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): బాలుణ్ణి క్రూరంగా హత్యచేసిన హంతకుడు పోలీసులపైనా అదే జులుం ప్రదర్శించాడు. చేతికి దొరికిన ఖాళీ బీర్‌ బాటిల్‌తో దాడి చేసి, వారినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఆరు రౌండ్ల కాల్పులు జరిపి హంతకుడిని ఎట్టకేలకు పోలీసులు తిరిగి అదుపులోకి తీసుకున్నారు. కోనుప్పలపాడు గ్రామానికి చెందిన బాలుడు హేమచంద్రను సొంత బావ సర్వేశ్‌ అపహరించి, హత్యచేసిన విషయం తెలిసిందే. కిడ్నాప్‌, హత్య సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసేందుకు శుక్రవారం తెల్లవారుజామున నిందితుడిని సంఘటనా స్థలానికి పోలీసులు తీసుకువెళ్లారు. చింతలాయపల్లి-కుందనకోట ఘాట్‌లోని కొండ వద్ద 5:30 గంటల నుంచి 6 గంటల మధ్య రీకన్‌స్ట్రక్షన్‌ చేపట్టారు. ఈ క్రమంలో సర్వేశ్‌ పక్కనే ఉన్న ఖాళీ బీరు బాటిల్‌ తీసుకుని కానిస్టేబుల్‌ వెంకటేశ్‌ నాయక్‌పై దాడి చేశాడు. ఆ తర్వాత సీఐ రామసుబ్బయ్యపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, పోలీసులు ఆగిపోవాలంటూ పలుమార్లు హెచ్చరించారు. అయినా ఖాతరు చేయకపోవడంతో సీఐ రామసుబ్బయ్య గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం సర్వేశ్‌ కాళ్లకు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. బుల్లెట్‌ గాయాలతో పడిపోయిన అతణ్ణి, గాయపడిన సీఐ, కానిస్టేబుల్‌ను తొలుత తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు ఆపై అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ, కానిస్టేబుల్‌ను ఆస్పత్రిలో ఎస్పీ జగదీష్‌ పరామర్శించారు. కాగా, సర్వేశ్‌పై పోలీసులు కాల్పులు జరిపారని తెలియగానే కోనుప్పలపాడు గ్రామస్థులు టపాసులు పేల్చి హర్షం వ్యక్తం చేశారు. నిందితున్ని ఎన్‌కౌంటర్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Untitled-3 copy.jpg


ఉగాది రోజే స్కెచ్‌..?

కోనుప్పలపాడుకు చెందిన గోవిందు, లక్ష్మీకాంతమ్మ దంపతుల పెద్ద కూతురు అనితను ప్రేమ వివాహం చేసుకున్న సర్వేశ్‌, వారి ఆస్తిపై కన్నేశాడు. జల్సాలకు అలవాటుపడి, డబ్బుకోసం అత్త, మామలను, భార్యను వేధించేవాడు. వీరికి గుత్తి మండలం జక్కలచెరువు గ్రామంలో రెండు ఎకరాల పొలం ఉంది. దీనిపై సర్వేశ్‌ కన్నేశాడని గ్రామస్థులు అంటున్నారు. ఆస్తి తనకు రాసివ్వకుంటే కుటుంబంలో అందరినీ చంపుతానని తనను బెదిరించేవాడని భార్య అనిత తెలిపారు. ఈ క్రమంలోనే ఉగాది పండుగరోజు కుటుంబం మొత్తాన్ని కడతేర్చేందుకు సర్వేశ్‌ ప్రయత్నించాడని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పండుగరోజు అత్తమామలు, మరదళ్లు, బావమరిదితో సర్వేశ్‌ గ్రామ సమీపంలోని కోన జలపాతం వద్దకు వెళ్లాడు. అక్కడ సుమారు 200 అడుగులకు పైగా ఎత్తులో ఉన్న మారడమ్మ గుడి వద్దకు ఇద్దరు మరదళ్లు, బావమరిదిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. ‘పిల్లలను అంత ఎత్తుకు ఎందుకు తీసుకువెళుతున్నావ్‌..? వద్దులే’ అని అల్లుడిని లక్ష్మీకాంతమ్మ అడ్డుకున్నట్లు తెలిసింది. అల్లుడి తీరుపై అనుమానంతో ఆ రోజు అడ్డుకోవడంతో పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారని, లేదంటే అక్కడే ముగ్గురినీ చంపేవాడేమోనని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాడిపత్రి మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడిని హత్య చేసిన కేసులో సర్వేశ్‌ ప్రధాన నిందితుడు. ఇతనిపై యాడికి పోలీ్‌సస్టేషన్‌లో రౌడీషీట్‌ ఉంది.

Updated Date - Mar 28 , 2026 | 04:12 AM