Share News

రైలు దోపిడీల్లో రాజస్థాన్‌ ముఠా!

ABN , Publish Date - Jun 22 , 2026 | 06:03 AM

బాపట్ల శివారులో సర్కారు ఎక్క్‌ప్రెస్‌ రైలులో చోరీ జరిగిన సరిగ్గా వారానికి రైల్వే పోలీసులు ఆదివారం ఓ నిందితుడి అరెస్టును అధికారికంగా చూపించారు. రాజస్థాన్‌కు చెందిన భవారియా గ్యాంగ్‌ ఈ దోపిడీకి..

రైలు దోపిడీల్లో రాజస్థాన్‌ ముఠా!

  • సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ దోపిడీలో నిందితుడి అరెస్ట్‌

  • మరో ఐదుగురు నిందితుల పేర్ల ప్రకటన

  • రాజస్థాన్‌కు చెందిన భవారియా గ్యాంగ్‌గా గుర్తింపు

  • నోటీసిచ్చి వదిలేసిన వ్యక్తినే అరెస్టు చూపించిన రైల్వే పోలీసులు

  • నిందితుడి ప్రమేయంపై లేని స్పష్టత

  • వరుస దోపిడీలపై విమర్శల నుంచి గట్టెక్కడానికేనా?

(బాపట్ల-ఆంధ్రజ్యోతి)

బాపట్ల శివారులో సర్కారు ఎక్క్‌ప్రెస్‌ రైలులో చోరీ జరిగిన సరిగ్గా వారానికి రైల్వే పోలీసులు ఆదివారం ఓ నిందితుడి అరెస్టును అధికారికంగా చూపించారు. రాజస్థాన్‌కు చెందిన భవారియా గ్యాంగ్‌ ఈ దోపిడీకి పాల్పడిందని, ఆ ముఠా సభ్యుల్లో ఒకడైన సోనును ఆదివారం బాపట్ల రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫాం 3లో అదుపులోకి తీసుకున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో మొత్తం సభ్యులు ఆరుగురు కాగా ఐదుగురిది రాజస్థాన్‌, ఇంకొకరిది.. హరియాణాగా తేల్చారు. మిగిలిన ఐదుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని రైల్వే పోలీసులు ప్రకటించారు. ఈ నెల 14 అర్ధరాత్రి తర్వాత బాపట్ల శివారులో సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో చైన్‌ లాగి లాగి ఎస్‌-3, 6 బోగీల్లోని ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి 75 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించిన కేసుకు సంబంధించిన పురోగతిలో భాగంగానే రైల్వే పోలీసులు నిందితుడి అరెస్టు చూపించారు. ఇదే కాకుండా ఏప్రిల్‌లో అప్పికట్ల స్టేషన్‌ దాటాక జరిగిన రైలు దోపిడీతో పాటు మే నెలలో నిడుబ్రోలు స్టేషన్‌ సమీపంలో చోరీకి విఫలయత్నం చేసిన ముఠా కూడా ఈ భవారియా గ్యాంగేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. మూడు వరుస ఘటనలకు గాను ఓ దోపిడీ కేసు ఛేదించినట్లుగా రైల్వే పోలీసులు అధికారికంగా ప్రకటించుకున్నప్పటికీ, వరుస దోపిడీల నేపథ్యంలో వస్తున్న విమర్శల నుంచి తప్పించుకునే క్రమంలోనే ఛేదనలో సిత్రాలకు తావిచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఘటన జరిగిన రోజు అనుమానితుడిగా...

ప్రస్తుతం అరెస్టు చూపిన సోనునే.. దోపిడీ జరిగిన రోజు అనుమానితుడిగా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విచారణ అనంతరం నోటీసులిచ్చి అతడ్ని పంపేశామని, కానీ విచారణకు హాజరుకాకపోవడంతో శోధించి బాపట్ల రైల్వే స్టేషన్‌ ఫ్లాట్‌పాంపై ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే ఎస్‌ఐ తెలిపారు. నిజానికి ఘటన జరిగిన రోజు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారించి అతడి విడిచిపెట్టారు. ఈ మొత్తం ఎపిపోడ్‌లో అనుమానితుడిగా సోనును అదుపులోకి తీసుకున్నది ఘటన జరిగిన ప్రదేశంలోనా? లేక రైల్వేస్టేషన్‌లోనా? అనేదానికి పోలీసుల వద్ద స్పష్టత లేదు.

అన్ని వైపుల నుంచి విమర్శలు..

రెండు నెలల వ్యవధిలో ఒకే మార్గంలో మూడు రైలు దోపిడీలు జరగడంతో.. రైల్వే ఎస్కార్ట్‌ వైఫల్యంతో పాటు ప్రయాణికుల భద్రతపై చర్చ మొదలైంది. సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘటనకు ముందు జరిగిన రెండు ఉదంతాల్లో ఎలాంటి పురోగతీ రైల్వే పోలీసులు చూపించలేకపోయారు. ఈ క్రమంలో వారం తర్వాత కూడా ఎలాంటి పురోగతీ సాధించలేక.. నాడు వదిలేసిన ఓ నిందితుడిని.. ఇప్పుడు అధికారికంగా అరెస్టు చూపించి, విమర్శల నుంచి తాత్కాలిక ఉపశమనం పొందే ప్రయత్నం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

రికవరీ ఏదీ?

సోనును ముఠాలో ఓ సభ్యుడిగా రైల్వే పోలీసులు అధికారికంగానే చెప్పారు. మిగతా సభ్యుల వివరాలు కూడా అతడి విచారణలోనే తేలినట్లు తెలుస్తోంది. వారం గడిచినా అనుమానితుడి అరెస్ట్‌ చూపడంతో పాటు మిగిలిన ముఠా సభ్యుల విషయంలో పేర్లతోనే సరిపెట్టారు తప్పితే మరే సమాచారం లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే ముఠాలో సోను ఒకడైనప్పుడు రికవరీ అసలేమీ లేకపోవడం కూడా విడ్డూరంగానే ఉంది. అలాగే, ఆ రోజు ఘటనా స్థలంలో బ్యాగులు దొరికినట్లు ప్రకటించినప్పటికీ వాటికి ఈ చోరీకీ సంబంధం లేదని తేల్చినట్లు సమాచారం.

Updated Date - Jun 22 , 2026 | 06:04 AM