Sankranti Travel Rush: పల్లెకు పోదాం.. చలో..!
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:57 AM
తెలంగాణ నుంచి ఏపీకి సంక్రాంతి ప్రయాణాలు ఊపందుకున్నాయి. పండుగకు వారం రోజులకు పైగా సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి వేలాది కార్లు విజయవాడకు..
హైదరాబాద్ నుంచి ఏపీకి సంక్రాంతి ప్రయాణాలు .. కిటకిటలాడుతున్న జాతీయ రహదారులు
కంచికచర్ల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్
చిల్లకల్లు, కీసర టోల్‌ప్లాజాల దగ్గర వాహనాల బారులు
విజయవాడ వద్ద పశ్చిమ బైపాస్ మీదుగా మళ్లింపు
కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సులు, రైళ్లు
విజయవాడ/ఏలూరు క్రైం/పెదపాడు, జనవరి 10(ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి ఏపీకి సంక్రాంతి ప్రయాణాలు ఊపందుకున్నాయి. పండుగకు వారం రోజులకు పైగా సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి వేలాది కార్లు విజయవాడకు క్యూ కట్టాయి. కోస్తా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చేవారితో జాతీయ రహదారులు కిటకిటలాడుతున్నాయి. చిల్లకల్లు, కీసర టోల్‌గేట్ల దగ్గర తీవ్ర రద్దీ నెలకొంది. శనివారం తెల్లవారుజాము నుంచే రికార్డు స్థాయిలో వాహనాలు రావడం మొదలైంది. ట్రాఫిక్ ప్రభావం విజయవాడపై పడింది. వాహనాలను మధ్యాహ్నం నుంచి పశ్చిమ బైపా్‌సకు మళ్లించడంతో రద్దీ తగ్గింది. మరోవైపు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వైపు హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్-65పై ఫ్లైవోవర్ నిర్మాణం పూర్తికాకపోవడం, సర్వీసు రోడ్డు మీదుగానే ప్రయాణాలు సాగించాల్సి రావడంతో వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. జాతీయ రహదారిపై అనాసాగరం దాటి మునగచెర్ల వరకు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని నియంత్రిస్తున్నారు. ఇక విజయవాడ నుంచి ఏలూరు మీదుగా వెళ్లే రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. కలపర్రు టోల్‌గేట్ వద్ద వాహనాల శ్రేణులు బారులు తీరడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. నాచుకుంట టోల్‌గేట్ వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
బస్సులు, రైళ్లు ఫుల్
హైదరాబాద్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఏపీఎ్‌సఆర్‌టీసీ హైదరాబాద్ నుంచి నడిపే 110 షెడ్యూల్ బస్సులు నిండిపోగా, శుక్రవారం అదనంగా 25 స్పెషల్స్ నడిపింది. శుక్రవారం తెలంగాణ ఆర్టీసీకి చెందిన షెడ్యూల్ బస్సులు 200 కాకుండా మరో 50 స్పెషల్స్ పంపారు. ఇక శనివారం 100కు పైగా ప్రత్యేక బస్సులు నడిపారు. సొంతూళ్లకు వచ్చే వారికోసం ఎన్టీఆర్ జిల్లా రీజియన్ అధికారులు 526 స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ వైపు వెళ్లే రైళ్లన్నీ అసాధారణ స్థాయిలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. ఇవికాకుండా 16 స్పెషల్ రైళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ- హైదరాబాద్‌ల మధ్య శనివారం నుంచి మరో రెండు స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. వీటిని ఈ నెల 19 వరకు నడపనున్నారు.