Share News

Sankranti Cockfights: పందేలకు సై!

ABN , Publish Date - Jan 14 , 2026 | 04:20 AM

ఏ ఇల్లు చూసినా కళకళ! కుటుంబ సభ్యులు, బంధువుల రాకతో ఒక్కటే సందడి! సంక్రాంతి ముందే గ్రామాల్లో పండగ వాతావరణం! మరోవైపు కోడి పందేలకు బరులు సిద్ధం! తెల్లవారడమే ఆలస్యం.. పందేలకు సై అంటున్నారు.

Sankranti Cockfights: పందేలకు సై!

  • నేడు తెల్లవారగానే కోడి పందేలతో ఫుల్‌ జోష్‌

  • గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో

  • భారీ ఏర్పాట్లు.. ఇప్పటికే సందడి

  • తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి

  • భారీగా రాక.. రోడ్లన్నీ జామ్‌ జామ్‌

  • బెజవాడలో హోటళ్లు, లాడ్జీలు ఫుల్‌

  • వారం రోజులకు 5 వేల గదులు బుకింగ్‌

  • ఎన్టీఆర్‌-ఏలూరు జిల్లాల సరిహద్దున

  • వీవీఐపీల కోసం క్యారవాన్లు సిద్ధం

  • రానున్న రాజకీయ, సినీ ప్రముఖులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఏ ఇల్లు చూసినా కళకళ! కుటుంబ సభ్యులు, బంధువుల రాకతో ఒక్కటే సందడి! సంక్రాంతి ముందే గ్రామాల్లో పండగ వాతావరణం! మరోవైపు కోడి పందేలకు బరులు సిద్ధం! తెల్లవారడమే ఆలస్యం.. పందేలకు సై అంటున్నారు. బుధవారం భోగితో సంక్రాంతి సంబరాలతో పాటు కోడి పందేలూ మొదలవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పందెంకోళ్లు కాళ్లు దువ్వుతున్నాయి. బరిలో తాడోపేడో తేల్చుకునేందుకు కొక్కొరో..కో అంటూ సవాల్‌ విసురుతున్నాయి. సంప్రదాయం పేరిట సంక్రాంతి మూడు రోజులూ యథేచ్ఛగా కోడి పందేలు ఆడటానికి రంగం సిద్ధమైంది. పెద్ద ఎత్తున బరులు ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. కోడి పందేలతో పాటు అదే సమయంలో గుండాటలు, పేకాటలూ జోరుగా జరగనున్నాయి. కోడిపందేలు తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలకు రానున్నారు. విజయవాడలో మొత్తం హోటళ్లు, లాడ్జీలు నిండిపోయాయి. ఏకంగా 5 వేల గదులను బుక్‌ చేసుకున్నారు. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులు ఇక్కడ బస చేసి, కోడి పందేలు చూసేందుకు ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాలకు వెళ్లనున్నారు. ఈ సీజన్‌లో ఎన్టీఆర్‌-ఏలూరు జిల్లా సరిహద్దున వీవీఐపీల కోసం ఏకంగా క్యారవాన్స్‌ ఏర్పాటు చేయడం ప్రత్యేకత. పలు ప్రాంతాల్లో విజేతలకు అందజేసేందుకు కార్లు, బుల్లెట్లు, బైకులు సిద్ధంగా ఉంచారు. కొన్ని చోట్ల ముహూర్తం కోసం మంగళవారమే పందేలను లాంఛనంగా ప్రారంభించారు.


పోలీసులతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో, వారికి మామూళ్లతో ఈ జూద క్రీడలు హోరెత్తిపోనున్నాయి. సంక్రాంతి సంబరాలు, కోడి పందేలు చూసేందుకు ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి గోదావరి జిల్లాలకు బస్సులు, వాహనాల్లో పెద్దఎత్తున వస్తూనే ఉన్నారు. విజయవాడ నుంచి ఆ జిల్లాలకు వచ్చే వాహనాల సంఖ్య మంగళవారం భారీగా పెరిగింది. కలపర్రు టోల్‌గేటు వద్ద వాహనాల రద్దీ పెరిగింది. మంగళవారం రాత్రి 8 గంటల వరకూ 17,221 వాహనాలు దాటాయి. తెల్లవారేసరికి మరో 20 వేల వరకూ వస్తాయని అంచనా.


తూర్పులో ‘ఢీ’కి.. బరులు రెడీ

అమలాపురం, రాజోలుతో పాటు మెట్ట ప్రాంతమైన జగ్గంపేట తదితర చోట్ల బరులకు బోణీ చేశారు. కోనసీమలో వందకు పైగా సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఐ.పోలవరం మండలం మురమళ్లలోని సువిశాలమై ప్రాంతంలో ఫ్లడ్‌ లైట్ల వెలుగులో పందేలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలోనే అతిపెద్ద వీఐపీ బరిగా పేరొందిన ఇక్కడకు వచ్చే అతిథులు, పందెంరాయుళ్లకు సకల సౌకర్యాలు కల్పించారు. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లోనూ వందల బరుల్లో పందేల జోరు కొనసాగనుంది. ఇక ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చిన్నాపెద్దా కలిపి ఒక్కో బరిలో రోజుకు కోడి పందేలు, గుండాట కలిపి రూ. 15 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతాయని అంచనా. మురమళ్లలో రోజుకు రూ. 2 కోట్ల వరకు లావాదేవీలు జరగనున్నాయి. కాకినాడ రూరల్‌, తుని, సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురంలో అత్యధిక పందేలు గెలిచిన వారికి బుల్లెట్లు, కార్లు గిఫ్ట్‌లుగా ఇవ్వబోతున్నారు. కరప మండలంలో మూడు రోజుల పందేల విజేతకు ఇన్నోవా కారు అందించనున్నట్టు ప్రకటించారు. వెరసి ఉమ్మడి జిల్లాలో భోగి రోజు కోడి పందేలు, గుండాటల్లో రూ. 70 కోట్లు చేతులు మారతాయని భావిస్తున్నారు.


బాపట్లలో కత్తులు దూసిన కోళ్లు

బాపట్ల జిల్లాలో మంగళవారమే సంక్రాంతి సందడి మొదలైంది. చుట్టుపక్కల జిల్లాలతోపాటు తెలంగాణ నుంచి కూడా వేలాది మంది తరలివచ్చి లక్షల్లో పందేలు కాశారు. జిల్లాలోని అధికార పార్టీ ప్రధాన నేత ఆధ్వర్యంలో పది బరులు ఏర్పాటు చేశారు. వాటి సమీపంలోనే పేకాట, కోతముక్క, గుండాట, నంబర్ల ఆటలు నిర్వహించారు. చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో రూ.10వేలు, రూ.20వేలు, రూ.50వేలు, రూ.లక్ష విభాగాల్లో ప్రత్యేక బరులు ఏర్పాటు చేశారు. వీఐపీ బరుల్లో లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పందేలు నిర్వహించారు. మహిళలు సైతం భారీగా తరలివచ్చారు. బరుల వద్దే ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.


బెజవాడ హౌస్‌ఫుల్‌

విజయవాడలో అన్ని స్టార్‌ హోటళ్లు, లాడ్జీలు నిండిపోయాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గంలో కేసరపల్లి, గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో భారీగా బరులు ఏర్పాటు చేశారు. నందిగామ నియోజకవర్గంలో కొత్తగా క్యాసినోను పరిచయం చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలను వీక్షించడానికి పొరుగున ఉన్న తెలంగాణ నుంచి సందర్శకులు భారీగా వస్తున్నారు. విజయవాడలో వసతి ఏర్పాటు చేసుకోవడంతో నగరంలో మొత్తం 15 స్టార్‌ హోటళ్లు, 80 లాడ్జీలలో మొత్తం 5 వేల గదులు నిండిపోయాయి. గదులన్నీ వారం రోజుల వరకు బుక్‌ చేసుకున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. విజయవాడలో వసతి ఏర్పాటు చేసుకుని సందర్శకులు గుడివాడ, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో జరిగే కోడిపందేలను చూడటానికి వెళ్తారు. కొంతమంది ఏలూరు జిల్లా మీర్జాపురంలో ఏర్పాటు చేసిన హైటెక్‌ కోడిపందేల శిబిరం వద్దకు, మరికొంతమంది భీమవరంలో జరిగే బరుల వద్దకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ సంక్రాంతి సీజన్‌లో మొదటిసారిగా క్యారవాన్స్‌ను కూడా సిద్ధం చేశారు. కృష్ణా-ఏలూరు జిల్లాల మధ్యన గన్నవరం, నూజివీడుల సరిహద్దున బిళ్ళనపల్లి, మీర్జాపురంల వద్ద ఏర్పాటు చేస్తున్న టెక్‌ కోడి పందేలకు రెండు తెలుగు రాష్ర్టాల నుంచి వీవీఐపీలు వస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు వస్తున్నారు. ఇప్పటికే వీరికోసం ఏసీ గ్లాస్‌ గ్యాలరీలను ఏర్పాటు చేశారు. విజయవాడ, హనుమాన్‌ జంక్షన్‌, ఏలూరు, నూజివీడు, గన్నవరంలో హోటల్స్‌ అన్నింటినీ వీరి కోసం బుక్‌ చేశారు. పోటీలు జరిగే రోజున అక్కడే విశ్రాంతి తీసుకోవటానికి నిర్వాహకులు క్యారవాన్స్‌ రప్పించారు. మంగళవారం సాయంత్రానికి నాలుగు రాగా, అర్ధరాత్రికి మరో ఆరు వరకు రానున్నాయి. రూ.కోట్లలో పందేలు కాస్తుండటంతో.. అతిథులకు ఆ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ పందేలు కొట్టేవారికి థార్‌, బ్రెజా కార్లను కూడా ఇస్తున్నారు. వీటిని భోగి రోజున బరులకు తీసుకువస్తారు. రామన్నగూడెం, సింగన్నగూడేలలో పందేల నిర్వాహకులు విజేతలకు బైక్‌లు ఇస్తున్నారు.


ఏలూరు జిల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు

ఏలూరు జిల్లాలో కోడి పందేలకు బరులు సిద్ధమయ్యాయి. పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నప్పటికీ బుధవారం ఉదయానికి పునరుద్ధరించే దిశగా రాజకీయ నాయకులు పావులు కదుపుతున్నారు. పందెం కోళ్ల పోట్లాటకు బోగి రోజు ఉదయం 10.30 గంటలకు ముహుర్తాలను కూడా పెట్టేసుకున్నారు. నూజివీడు రూరల్‌ మండలం మీర్జాపురంలో 10 ఎకరాల బరి సిద్ధమైంది. రాజకీయ నాయకులు, ముఖ్యమైన నేతలతో మూడు రోజులు పందేలు వేస్తారు. గుండాట, లోన, బయట పేకాటకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మూడు వేలమందికి పైగా కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. కైకలూరు రూరల్‌ మండలంలోని భుజబలపట్నంలో ప్రతీ రోజు రెండు కోట్లకు పైగా డబ్బులు చేతులు మారుతాయని చెబుతున్నారు. ఇక్కడ కైకలూరు-నరసాపురం హైవే పక్కన భారీ సెట్టింగులతో రెండు ఎకరాల్లో బరి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆకివీడు, దుంపగడప, ఉండి, కైకలూరు, ఏలూరు, ఏలూరుపాడు, ఐ.భీమవరం, కలిదిండి నుంచి పెద్ద ఎత్తున తిలకించడానికి వస్తారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో 5 ఎకరాలోపు స్థలాన్ని బరులకు సిద్ధం చేశారు. పోలవరం ముంపు మండలమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో భారీగా బరులు సిద్ధం చేశారు. చింతలపూడిలో తెలంగాణ సరిహద్దు సమీపంలోని చింతపల్లి, రాఘవాపురంలో మామిడి, పామాయిల్‌ తోటల్లోనే భారీగానే జరగనున్నాయి. ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఇళ్ల స్థలాల మధ్య భారీ బరిలో హైటెక్‌ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ నుంచి కూడా ఇక్కడకు భారీగా రానున్నారు. ముదినేపల్లిలో పెదపాలపర్రు, బొమ్మినంపాడులో వరుసగా ఐదు పందేల్లో గెలిచిన పుంజు యజమానికి కారును బహుమతిగా ఇవ్వనున్నారు.

Updated Date - Jan 14 , 2026 | 04:23 AM