శ్రీశైలంలో 12 నుంచి సంక్రాంతి ఉత్సవాలు
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:04 AM
శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది.
ఏడు రోజుల పాటు నిర్వహణ
శ్రీశైలం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ సోమవారం నుంచి ఉత్సవాలు ప్రారంభమై 18వ తేదీన ముగుస్తాయని ఆలయ పాలకమండలి చైర్మన పోతుగుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం వారు పత్రికాప్రకటన విడుదల చేశారు. ఏడు రోజులపాటు పంచాహ్నిక దీక్షలతో స్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. 12వతేది ఉదయం యాగశాల ప్రవేశంతో ప్రారంభమై సాయంత్రం ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపట ఆవిష్కరణ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతాయి. 13 నుంచి వాహనసేవలు ప్రారంభమై 15 వతేది సంక్రాంతి రోజున లీలా కల్యాణం, 18వతేది ఆఖరిరోజున పుష్పోత్సవ, శయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అదే విధంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలైన గణపతిహోమం, రుద్ర, మృత్యుంజయం, చండీ హోమాలతోపాటు వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, స్వామిఅమ్మవార్ల లీలా కల్యాణోత్సవాలు ఉదయాస్తమానసేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాలసేవ, ఏకాంతసేవలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం అధికారులు వెల్లడించారు.