Share News

సంబరంగా సంక్రాంతి వేడుకలు

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:15 AM

సంక్రాంతి పండుగ సంబరాలను నంద్యాల, నందికొట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాల్లో సంతోషంగా జరుపుకున్నారు.

 సంబరంగా సంక్రాంతి వేడుకలు
ఉత్సవమూర్తుల ఊరేగింపు

మూడురోజుల పాటు

ఆనందంగా పండుగ సందడి

స్వామివార్ల గ్రామోత్సవాలు

గ్రామాల్లో ముగ్గుల పోటీలు

నంద్యాల కల్చరల్‌/ రూరల్‌/ నం దికొట్కూరు/ ఆత్మకూరు/ వెలుగో డు/పాములపాడు/ బండి ఆత్మకూ రు/గడివేముల/జూపాడుబంగ్లా/ కొత్తపల్లి/పగిడ్యాల/పాణ్యం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సంబరాలను నంద్యాల, నందికొట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాల్లో సంతోషంగా జరుపుకున్నారు. తొలిరోజైన భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, చివరి రోజైన శుక్రవారం కనుమ జరుపుకున్నారు. ఆడపడుచులంతా పుట్టినిళ్లకు రావడంతో పిల్లాపాపలతో సందడి వాతావరణం నెలకొంది. సంక్రాంతి పర్వదినాన్ని వేడుకలను పురస్కరించుకుని గ్రామాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు గ్రామీణ క్రీడాపోటీలను నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో పారువేట, గ్రామోత్సవాలు నిర్వహించారు. రథోత్సవాలు నిర్వహించారు. ఇదిలావుంటే ఏపీ రైతు సంఘం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, పరుగు పందెం, కబడ్డీ, మ్యూజికల్‌ చైర్‌ తదితర పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.

భక్తి శ్రద్ధలతో పారువేట ఉత్సవం

మహానంది: మహానంది క్షేత్రంలో సంక్రాంతి పర్వదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో వేదపండితులు భక్తి శ్రద్ధలతో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయంలో గంగిరెద్దు ఉత్సవంను జరిపారు. సాయంత్రం ఉత్సవమూర్తుల విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఆశీనులు గావించారు. మహానంది పురవీధుల్లో తప్పెట్ల మోతతో గ్రామోత్సవం నిర్వహించారు. స్ధానిక అటవీ పర్యావరణ విద్యాకేంద్రం వద్ద స్వామీ,అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులు గావించారు. పారువేట పూజలను చేశారు. ముగ్గుల పోటీల్లో విజేతలైన మహిళలకు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి బహుమతులు అందచేశారు అనంతరం నిర్వహించిన పరుగుపందెంలో విజేత అయిన చల్లా తేజను ఈవో అభినందించారు. కార్యక్రమంలో ఏఈఓ మధు, పర్యవేక్షకులు శశిధర్‌రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, సుబ్బారెడ్డితో పాటు స్ధానికులు పాల్గొనగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఎస్‌ఐ రామ్మోహనరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. అలాగే మండలంలోని గ్రామాల్లో మకరసంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రజలు వేడుకలు నిర్వహించుకొన్నారు.

శ్రీశైలంలో కనుమ వేడుకలు

శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానంలో కనుమ సందర్భంగా గోపూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాకారంలోని శ్రీగోకులంలో, గోశాలలోని గోమాతలకు ప్రత్యేక పూజలు జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శ్రీసుక్తం, గోఅష్టోత్తర శతనామివళి, నివేదన నీరాజన మంత్రపుష్పాలతో గోమాతలను పూజించారు. గోవులకు గోవత్సాలకు (ఆవు దూడలు) నూతన వస్త్రాలు సమర్పించారు. అనంతరం గోశాలలో శ్రీకృష్ణుని విగ్రహానికి షోడశోపచార పూజలు జరిపించి గోమాతలకు, వృషభాలకు వస్త్రాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Jan 17 , 2026 | 12:16 AM