Cultural Heritage: సంస్కృతి, సంప్రదాయాల సమ్మిళితం సంక్రాంతి
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:05 AM
మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు
అమరావతి, న్యూఢిల్లీ, జనవరి 14(ఆంధ్రజ్యోతి): మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలతో లోక్‌భవన్ అధికారులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన భాగం. ఉత్సాహభరితమైన సంక్రాంతి వేడుకలు మన యుగాల నాటి సంప్రదాయాలు, సమాజంలోని అన్ని వర్గాలను కలిపి ఉంచే వైభవమైన గతం యొక్క జ్ఞాపకాలను వెలికితీస్తాయి. ఈ శుభ సందర్భం మనందరిలో ప్రేమ, అప్యాయతలను, స్నేహ, సోదర భావాలను పెంపొందిస్తుంది’ అని గవర్నర్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఓ ప్రకటన చేస్తూ... ‘విశిష్టమైన ఈ సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పాడిపంటలతో పల్లె సీమలు మరింత కళకళలాడాలి. ఆధునికతను సంతరించుకున్నప్పటికీ, మన సంప్రదాయాలను మరచిపోకుండా పాటించాలి. రైతన్నలు ఆనందంగా ఉండాలని, కష్టజీవులు శ్రమకు తగిన ఫలితం పొందాలని కోరుకుంటున్నా. అందుకు అనువైన పథకాలతో ప్రభుత్వం మరింత బాధ్యతతో వ్యవహరిస్తుందని హామీ ఇస్తున్నా’ అని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేస్తూ... ‘సంక్రాంతి అనగానే భోగి మంటలు, గంగిరెద్దుల, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, సంప్రదాయ పందాలు, కొత్త దుస్తులు, పిండి వంటలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయి. కూటమి ప్రభుత్వం రాకతో ఏపీ అంతటా ప్రశాంతత వెల్లివిరుస్తోంది. ఈ సంక్రాంతి తెలుగు వారందరికీ సర్వైశ్యర్యం, సమృద్ధి, శుభ మంగళాలను ప్రసాదించాలని ఆ సర్వేశ్వరుడ్ని వేడుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయం ముందు భోగి సంబరాలు
సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటల వెలుగుల్లో తిరుమల శ్రీవారి ఆలయం ప్రత్యేక కళను సంతరించుకుంది. శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద వేకువజామున టీటీడీ అధికారులు, సిబ్బంది సంప్రదాయంగా భోగి వేశారు. ఈక్రమంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు కూడా భోగి సంబరాల్లో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి