AP Bhavan: ఏపీ భవన్‌లో సంక్రాంతి సందడి
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:09 AM
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సంక్రాంతి సందడి నెలకొంది. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ బుధవారం తెల్లవారుజామున భోగి మంటలను వెలిగించి సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు.
భారీగా తరలివచ్చిన ఢిల్లీలోని తెలుగు ప్రజలు
మూడు రోజులు కొనసాగనున్న వేడుకలు
ఉచితంగా కొత్త సినిమాల ప్రదర్శన
న్యూఢిల్లీ, జనవరి 14(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సంక్రాంతి సందడి నెలకొంది. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ బుధవారం తెల్లవారుజామున భోగి మంటలను వెలిగించి సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉద్యోగులు రంగవల్లులు, గొబ్బెమ్మలను తీర్చిదిద్దారు. హరిదాసుల వేషధారణలు, కోడి పందేలు, రాష్ట్రం నుంచి వచ్చిన కళాకారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు తెలుగువాళ్లను అలరించాయి. తెలుగు వారికి వినోదం కోసం ఇటీవల విడుదలైన చలన చిత్రాలను ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల స్టాళ్లను, ఉత్తరాంధ్ర వంటలు, ఆంధ్ర రుచులను ఢిల్లీలోని తెలుగు వారికి అందించేందుకు ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సలహాదారు అశోక్ జైన్, ఉన్నతాధికారులు కదిరి మోహన ప్రభాకర్, సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీభవన్‌లో సంక్రాంతి సంబరాలు మూడు రోజులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. మకర సంక్రాంతి, కనుమ రోజుల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాలు, విందు వినోదాలతో ఏపీభవన్ కళకళలాడనుందన్నారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగువారు కుటుంబ సమేతంగా తరలిరావడంతో ఏపీ భవన్ సహా పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి.