Share News

Liquor Sales Surge: మందుబాబులకు పండగే!

ABN , Publish Date - Jan 17 , 2026 | 03:36 AM

తెలుగువారికి సంక్రాంతి పండుగ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా రెక్కలు కట్టుకుని మరీ సొంతూళ్లలో వాలిపోతుంటారు.

Liquor Sales Surge: మందుబాబులకు పండగే!

  • మూడ్రోజుల్లో రూ.438 కోట్ల మద్యం తాగేశారు

  • గత వారంలో 877 కోట్ల విక్రయాలు

అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): తెలుగువారికి సంక్రాంతి పండుగ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా రెక్కలు కట్టుకుని మరీ సొంతూళ్లలో వాలిపోతుంటారు. పండుగ సరదాలు, సంబరాలు, మందు, విందులు కూడా అంతేస్థాయిలో ఉంటాయి. మద్యం విక్రయాల లెక్కలు చూస్తుంటే గత మూడ్రోజుల్లో.. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో మందు బాబులు మద్యంలో మునిగి తేలినట్లు కనిపిస్తోంది. సాధారణ రోజులతో పోలిస్తే మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయి. కోడిపందేల బరులు పెరగడం కూడా ఈ విక్రయాలపై ప్రభావం చూపింది. ఇతర రాష్ట్రాల నుంచి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ రాకుండా ఎక్సైజ్‌ శాఖ పటిష్ఠ చర్యలు చేపట్టింది. వీటన్నిటి కారణంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు బాగా పెరిగాయి. రాష్ట్రంలో రోజూ రూ.85 కోట్ల అమ్మకాలు జరుగుతాయి. సాధారణ రోజుల్లో జరిగే అమ్మకాల కంటే జనవరి 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రెట్టింపు పెరిగాయి. ఆ వారంలో రూ.877 కోట్ల లిక్కర్‌ విక్రయాలు జరుగగా.. ఒక్క భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లోనే రూ.438 కోట్లు అమ్మారు. ఈ ఏడాది కొత్త సంవత్సరం సందర్భంగా కూడా మద్యం ఏరులైపారింది. డిసెంబరు 29 నుంచి జనవరి 1 వరకు 4 రోజుల్లోనే రూ.543 కోట్ల విలువైన మద్యాన్ని షాపులు, బార్ల లైసెన్సీలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) మొదటి మూడు త్రైమాసికాల్లో రూ.22,983 కోట్ల విక్రయాలు జరిగాయి.

Updated Date - Jan 17 , 2026 | 03:36 AM