గిరిజనుల పాలిట సంజీవని బైక్ అంబులెన్సు
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:37 AM
మన్యంలోని మారుమూల ప్రాంతాల్లోని గిరిజన రోగులకు అత్యవసర రవాణా సేవలను అందించేందుకు బైక్ అంబులెన్సులు సంజీవనిలా పని చేస్తున్నాయి.
ఏటా 20 వేల మందికి అత్యవసర సేవలు
ఉమ్మడి అల్లూరి జిల్లా వ్యాప్తంగా 70 వాహనాలు
2018 ఏప్రిల్‌లో సేవలు ప్రారంభం
జిల్లాకు మరో 30 బైక్ అంబులెన్సుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలోని మారుమూల ప్రాంతాల్లోని గిరిజన రోగులకు అత్యవసర రవాణా సేవలను అందించేందుకు బైక్ అంబులెన్సులు సంజీవనిలా పని చేస్తున్నాయి. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో 70 బైక్ అంబులెన్సులు ప్రతి ఏడాది 20 వేల మంది రోగులకు సేవలందిస్తున్నాయి. సేవలు పొందుతున్న వారిలో 30 శాతం మంది గర్భిణులుండడం విశేషం. అలాగే మరిన్ని మారుమూల ప్రాంతాలకు వాటి సేవలను విస్తరించాలనే లక్ష్యంతో 30 అంబులెన్సుల కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
జిల్లాలో పాడేరు ఐటీడీఏ పరిధిలో 42, రంపచోడవరంలో 22, చింతూరు ఐటీడీఏ పరిధిలో 6... మొత్తం 70 బైక్ అంబులెన్సులు నిత్యం మారుమూల ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాయి. ప్రతి ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకు జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికి పైబడి బైక్ అంబులెన్సుల ద్వారా అత్యవసర సేవలు అందిస్తున్నారు. అలాగే వారిలో 30 శాతం మంది గర్భిణులుండడం విశేషం. ఒక్కో అంబులెన్సు ద్వారా రోజుకు నలుగురు రోగులను సమీపంలోని ఆస్పత్రి తరలించాలనేది నిబంధన కాగా, ఏజెన్సీలో రోజుకు రెండు లేదా మూడు కేసులను ఒక బైక్ అంబులెన్సు నమోదు చేస్తున్నది. ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లోని గర్భిణులు, సాధారణ రోగులను వాటిపై ఎక్కించుకుని సమీపంలోని మెయిన్‌రోడ్డు వరకు తరలించి, అక్కడ నుంచి 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తున్నారు. దీంతో 108 వాహనం వెళ్లలేని ప్రాంతాలకు బైక్ అంబులెన్సులు చేరుకుని రోగులను బాహ్యప్రపంచానికి చేర్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని గిరిజనులు అంటున్నారు. ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులను సమీపంలోని ఆస్పత్రికి లేదా గర్భిణుల వసతి గృహాలకు చేర్చేందుకు బైక్ అంబులెన్సులు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
2018లో సేవలు ప్రారంభం
ఏజెన్సీలో 108 సాధారణ అంబులెన్సు వాహనం వెళ్లలేని ప్రాంతాలకు సైతం వాహన సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో 2018 ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బైక్ అంబులెన్సు సేవలను ప్రారంభించారు. ఇందులో భాగంగా పాడేరు ఐటీడీఏకి 42, రంపచోడవరానికి 22, పార్వతీపురానికి 24, కేఆర్‌పురానికి 8, సీతంపేటకు 15, శ్రీశైలానికి 6, చింతూరుకు 6 చొప్పున మొత్తం 123 బైక్ అంబులెన్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని మారుమూల పల్లెకు చేరువగా అందుబాటులో ఉంచారు. దీంతో మారుమూల ప్రాంతాలకు చెందిన రోగులు 108కు కాల్ చేస్తే ఆ ప్రాంతానికి బైక్ అంబులెన్స్‌ను తీసుకువెళ్లి, రోగిని ఎక్కించుకుని సమీపంలోని ఆస్పత్రికి లేదా, మరో సాధారణ 108 వాహనం వద్దకు తీసుకుని వెళుతున్నారు. అలాగే 108లో ఉన్న సిబ్బందే ఈ బైక్ అంబులెన్సులో పైలట్‌గా విధులు నిర్వహిస్తుండడంతో రోగికి అవసరమైన తక్షణ వైద్య సేవలను సైతం అందిస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు ఐటీడీఏల పరిధిలో నిత్యం వేలాది మంది గిరిజన రోగులకు బైక్ అంబులెన్సుల ద్వారా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు.
మరో 30 బైక్ అంబులెన్సులకు అధికారుల ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో నేటికీ అనేక గ్రామాలకు రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో పాటు అత్యవసర సేవలు పొందేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దీంతో జిల్లాకు మరో 30 వరకు బైక్ అంబులెన్సులను మంజూరు చేయాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. అవి మంజూరైతే పాడేరు ఐటీడీఏ పరిధిలో 20, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో 10 బైక్ అంబులెన్సుల సేవలు అదనంగా సమకూరనున్నాయని అధికారులు అంటున్నారు.