సజ్జల, ఎమ్మెల్సీ తూమాటిపై పరువు నష్టం దావా
ABN , Publish Date - Aug 21 , 2026 | 03:47 AM
సంగం డెయిరీపై నిరాధార ఆరోపణలు చేసిన వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, సాక్షి ఛానల్, సోషల్ మీడియా..
రూ.పది కోట్లకు దాఖలు చేసిన సంగం డెయిరీ
టీటీడీకి గేదె నెయ్యి సరఫరా చేశారంటూ నిరాధార ఆరోపణలు
గుంటూరు, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): సంగం డెయిరీపై నిరాధార ఆరోపణలు చేసిన వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, సాక్షి ఛానల్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లపై సంగం డెయిరీ పరువు నష్టం దావా కేసు దాఖలు చేసింది. టీటీడీకి ఆవు నెయ్యికి బదులుగా గేదె పాలతో చేసిన నెయ్యి సరఫరా చేశారంటూ నిరాధార ఆరోపణలు చేశారని సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ గుంటూరు కోర్టులో రూ.10 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు. గత శాసన మండలి సమావేశాల్లో తూమాటి మాధవరావు టీటీడీకి సంగం డెయిరీ కల్తీ నెయ్యి సరఫరా చేసిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సంగం డెయిరీ గేదె పాలను మాత్రమే సేకరించి, ఆ విధంగా వచ్చిన నెయ్యిని ఆవు నెయ్యిగా పేర్కొంటూ టీటీడీకి సరఫరా చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ సజ్జల కూడా మీడియా సమావేశంలో చెప్పారు. తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా వైసీపీ నాయకులు పథకం ప్రకారం నిరాధార ఆరోపణలు చేశారని సంగం ఎండీ పేర్కొన్నారు.