సనాతన ధర్మంపై దాడి చేయడమే లక్ష్యం
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:48 AM
హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ వంటి వారికి వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నాయకులు వత్తాసు పలకడం హిందువుల....
హిందువుల మధ్య విభేదాలతో రాజకీయ లబ్ధికి వైసీపీ యత్నం
హిందూ ధర్మాన్ని వ్యతిరేకించేవారికి జగన్, ఆ పార్టీ నాయకుల వత్తాసు
హిందూ సంఘాల నాయకులు, పీఠాధిపతుల రౌండ్‌టేబుల్ సమావేశం
విజయవాడ, జూలై 19(ఆంధ్రజ్యోతి): హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ వంటి వారికి వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నాయకులు వత్తాసు పలకడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమేనని హిందూ సంఘాల నాయకులు, పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సమాజం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ప్రస్తుత సామాజిక- రాజకీయ పరిణామాలపై ఆదివారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సాధు పరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన పరిస్థితులు పునరావృతం కాకుండా హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే వైసీపీని బహిష్కరించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. సనాతన ధర్మంపై దాడి చేయడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. హిందూ సంఘాల అధ్యక్షుడు శ్రీరామ్ మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయంలో దళిత హిందువులు, దళిత కైస్త్రవుల మధ్య ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం జరుగుతోందన్నారు. యువత కూడా ధర్మ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు, మత పరిరక్షణ, సామాజిక ఐక్యత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆనంద ఆశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి, పీఠాధిపతులు, హిందూ సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.