Share News

‘సమృద్ధ్‌ గ్రామ్‌’కు ప్రపంచ గుర్తింపు

ABN , Publish Date - Jul 14 , 2026 | 05:14 AM

భారత్‌ నెట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఆధారంగా గ్రామీణ ప్రజలకు ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్‌, ప్రభుత్వ సేవలను ఒకే కేంద్రం ద్వారా అందిస్తున్న ‘సమృద్ధ్‌ గ్రామ్‌’ కార్యక్రమానికి..

‘సమృద్ధ్‌ గ్రామ్‌’కు ప్రపంచ గుర్తింపు

  • ఇన్ఫర్మేషన్‌ సొసైటీ అంతర్జాతీయ పురస్కారం

  • కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 13(ఆంధ్రజ్యోతి): భారత్‌ నెట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఆధారంగా గ్రామీణ ప్రజలకు ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్‌, ప్రభుత్వ సేవలను ఒకే కేంద్రం ద్వారా అందిస్తున్న ‘సమృద్ధ్‌ గ్రామ్‌’ కార్యక్రమానికి జెనీవాలో జరిగిన వరల్డ్‌ సమ్మిట్‌ ఆన్‌ ది ఇన్ఫర్మేషన్‌ సొసైటీ (డబ్ల్యూఎస్ఐఎస్)-2026లో ‘సానుకూలవరణ సృష్టి’ విభాగంలో అంతర్జాతీయ పురస్కారం లభించిందని కేంద్ర గ్రామీణాభివృద్థి, కమ్యూనికేషన్స్‌ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్‌ సేవలను చేరువ చేస్తూ, ప్రజల జీవితాలకు సాంకేతికతను అనుసంధానం చేసిన ‘సమృద్ధ్‌ గ్రామ్‌’ కార్యక్రమానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని సోమవారం కేంద్ర మంత్రి చెప్పారు. ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్‌, ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడంలో ఈ కార్యక్రమం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. గుంటూరు జిల్లా నారాకోడూరు గ్రామం ఈ కార్యక్రమం ద్వారా డిజిటల్‌ సేవల ప్రయోజనాలను పొందుతున్న ఆదర్శ గ్రామాల్లో ఒకటిగా నిలవడం రాష్ట్రానికిమరింత గర్వకారణమని చెప్పారు. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన డిజిటల్‌ సేవలు నేడు గ్రామీణ ప్రాంతాలకు చేరుకోవడం డిజిటల్‌ ఇండియా విజయానికి నిదర్శనమన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో డిజిటల్‌ ేసవలను ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరవేస్తూ వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనకు మరింత వేగంగా ముందుకు సాగుతామని పెమ్మసాని తెలిపారు.

Updated Date - Jul 14 , 2026 | 05:14 AM