Share News

సమస్యలన్నీ పరిష్కరిస్తాం

ABN , Publish Date - Mar 15 , 2026 | 04:48 AM

సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా వాటి పరిష్కారానికి ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ చేస్తున్న కృషి అభినందనీయమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

సమస్యలన్నీ పరిష్కరిస్తాం

  • సాలూరువాసులకు మంత్రి సంధ్యారాణి హామీ

పార్వతీపురం, మార్చి 14(ఆంధ్రజ్యోతి): సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా వాటి పరిష్కారానికి ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ చేస్తున్న కృషి అభినందనీయమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో శనివారం నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రజాసమస్యల పరిష్కారానికి ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’.. ప్రజాప్రతినిధులు, అధికారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. పట్టణంలో 17వ వార్డు వాసులు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరిస్తాం’ అని చెప్పారు. సబ్‌ కలెక్టర్‌ వైశాలి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజలు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

సమస్యలు ఏకరువు పెట్టిన ప్రజలు

తమ ప్రాంతంలోని శ్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించాలని, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, రోడ్లు నిర్మించాలని 17వ వార్డు వాసులు అక్యాన అప్పారావు, త్రివేణి తదితరులు కోరారు. లో వోల్టేజీ సమస్యను పరిష్కరించాలన్నారు. సొసైటీకి స్థలం ఎంపిక చేసి, శాశ్వత భవనం నిర్మించాలని, శ్యామలాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలని, వితంతు పింఛను మంజూరు చేయాలని, చింతపిక్క తీత కార్మికులను ఆదుకోవాలని మరికొందరు కోరారు.

Updated Date - Mar 15 , 2026 | 04:48 AM