Share News

అమరావతి అభివృద్ధి కాదు

ABN , Publish Date - Jul 04 , 2026 | 04:24 AM

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ఒకటి రెండు రోజులకే పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణా రెడ్డి తెరమీదికి వచ్చేస్తారు.

అమరావతి అభివృద్ధి కాదు

  • అక్కడ పనులు ఆపి వేయాలి

  • విభజన చట్టంలోనే మావిగన్‌: సజ్జల

అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ఒకటి రెండు రోజులకే పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణా రెడ్డి తెరమీదికి వచ్చేస్తారు. అధినేత చెప్పింది జనానికి అర్థం కాలేదనో, అసలు ఆయన చెప్పినదాంట్లో అర్థమే లేదనో... కొన్ని వివరణలు ఇచ్చి, సమర్థనలు చేసి వెళ్లిపోతారు. శుక్రవారం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో వైసీపీ ‘మావిగన్‌’ మాటే ఎత్తలేదు. కానీ... రాష్ట్ర విభజన చట్టంలో దాని ప్రస్తావన ఉందని ఇప్పుడు సజ్జల చెప్పారు. ఎప్పుడో కట్టిన రాజధాని నగరాలు నయా రాయ్‌పూర్‌, చండీగఢ్‌ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదని.. రాజధానికి అనువుగాలేని అమరావతి ఎప్పటికీ అభివృద్ధి చెందదని వ్యాఖ్యానించారు. శివరామకృష్ణన్‌ కూడా అమరావతి ప్రాంతం రాజధానికి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారని తెలిపారు. అభివృద్ధి సాధ్యం కాని అమరావతిలో నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. 2029లో జగన్‌ అధికారంలోకి వచ్చాక ఈ అవినీతిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రజాధనం వృధా కాకుండా ఉండేందుకే ఆయన మావిగన్‌ ప్రస్తావన చేస్తున్నారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కడప ఉక్కుకు జగన్‌ కొబ్బరికాయ కొట్టినా పనులు జరగని విషయం చెప్పకుండా... 2024లో జగన్‌ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే.. కడప స్టీల్‌ ప్లాంట్‌ను పూర్తి చేసి ఉత్పత్తిని కూడా చేపట్టేవారని సజ్జల పేర్కొన్నారు. పారిశ్రామికవేత్త జిందాల్‌ను జెత్వానీ కేసులో ఇరికించి స్టీల్‌ప్లాంట్‌ను చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు.

Updated Date - Jul 04 , 2026 | 04:27 AM