చంద్రబాబు పాలిట జగన్ విలనే..: సజ్జల
ABN , Publish Date - May 02 , 2026 | 04:36 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలిట వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విలన్‌గానే కనిపిస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
అమరావతి, మే 1 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు పాలిట వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విలన్‌గానే కనిపిస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేస్తున్న అవినీతిని అనునిత్యం ప్రశ్నిస్తున్న జగన్ గొడ్డలిలానో.. కత్తిలానో.. సైకోలానో కనిపించడం సహజమేనన్నారు. శుక్రవారం తాడేపల్లి ప్యాలె్‌సలో ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. అమరావతిలో చంద్రబాబు నిర్మిస్తున్న ప్యాలె్‌సను రాజధాని నగర నిర్మాణ కాంట్రాక్టర్లే కడుతున్నారని.. ఆ ఇంటిని బినామీలే కడుతున్నందున.. ఆ ఇంటి ఛాయలకు ఎవరినీ రానివ్వడం లేదని సజ్జల ఆరోపించారు. తిరుమల లడ్డూ అంశంపై ఏమీ లేదని రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్‌కుమార్ ఇచ్చిన నివేదికతో తేలిపోయిందన్నారు. దేవదేవుడిని అడ్డం పెట్టుకుని తిరుమలలో చంద్రబాబు దోపిడీకి తెరతీశారని ఆరోపించారు. అమరావతిలో బహిరంగంగానే బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని.. సెక్రటేరియేట్ సహా ఇతర భవనాల అద్దాల కోసమే రూ.2,500 కోట్లు ఖర్చుపెడుతున్నారని చెప్పారు. జగన్ ‘మావిగన్’ ప్రకటనకు ప్రజల ప్రతిస్పందన చూసి చంద్రబాబు భయపడుతున్నారని.. అందుకే మూకుమ్మడిగా సామాజిక మాధ్యమాల్లోనూ, ఇతర వేదికలపైనా తిట్టారని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి నిబద్ధత కలిగిన సీనియర్ జర్నలిస్టు అని.. ఆయనపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందన్నారు.