మీ బాస్ ఎవరు?
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:33 AM
‘‘సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టమని చెప్పిన మీ బాస్ ఎవరు?. ఆయా పోస్టులను ముందుగా ఎవరికి పంపేవారు?.’’ వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డిని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ బృందం ప్రశ్నించింది.
షర్మిల, విజయలక్ష్మి, చంద్రబాబు, పవన్‌పై అసభ్య పోస్టులు పెట్టాలని ఎవరు చెప్పారు?
ఆ పోస్టులను ఎవరికి ముందు పంపేవారు?
వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డిని ప్రశ్నించిన అధికారులు
120 ప్రశ్నల్లో 1-2 ప్రశ్నలకే సమాధానం
పులివెందుల, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ‘‘సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టమని చెప్పిన మీ బాస్ ఎవరు?. ఆయా పోస్టులను ముందుగా ఎవరికి పంపేవారు?.’’ వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డిని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ బృందం ప్రశ్నించింది. ఆదివారం రెండోరోజు సజ్జలని సుదీర్ఘంగా టెక్నికల్, పోస్టుల పరంగా అధికారులు విచారించారు. సజ్జల భార్గవరెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్ లో రెండు కేసులలో ఏ2గా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి, ఆయన కుమార్తె షర్మిల, ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వారి కుటుంబ సభ్యులపైన అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్నారు. అలాగే ఆ పోస్టులు తొలగించాలని కోరిన పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురానికి చెందిన దళితుడైన హరిని కులం పేరుతో దూషించిన కేసులో భార్గవరెడ్డి ఏ2గా ఉన్నారు. అయితే, ఆయన కోర్టు నుంచి కండిషన్ బెయిల్ తీసుకున్నారు. ఈ రెండు కేసుల్లో 77 మందిపై కేసు నమోదైంది. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు శని, ఆదివారం పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో విచారణకు భార్గవరెడ్డి హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ విచారణ సాగింది.
టెక్నికల్ బృందం కూడా పలు కోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌తో కూడిన బృందంలో టెక్నికల్ అధికారులు దాదాపు 9 గంటల పాటు విచారణ సాగించారు. ‘‘మీ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు ఎక్కడున్నాయి?. వాటిని మాకు అప్పగించాలి.’’ అని టెక్నికల్ బృందం భార్గవరెడ్డిని కోరింది. అయితే, వాటిని కోర్టుకు అప్పగిస్తానని ఆయన చెప్పారు.
నకిలీ ఐడీలతో పోస్టులు పెట్టారా?
‘‘వైసీపీ ప్రత్యర్థులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమని చెప్పే మీ బాస్ ఎవరు?. అలాగే పోస్టులు ఎక్కడ రూపొందిస్తారు?. దీనికి కావాల్సిన సమాచారం, వివరాలు ఎవరు అందిస్తారు?. వీటిని మీ ఐడీల ద్వారా పోస్టులు చేస్తారా? లేక ఫేక్ ఐడీలతో పెడతారా?. మీ గ్రూప్ సభ్యుల్లోని ఐడీతో పోస్టులు చేస్తారా?.’’ అని టెక్నికల్ బృందం లోతుగా విచారించింది. మీరు తయారు చేసిన పోస్టులు ఏ1గా ఉన్న వర్రా రవీంద్ర పోస్టులు చేశారా? లేక మీరే పోస్టు చేశారా? అని ప్రశ్నించారు. మీ బృందం అసభ్యకర పోస్టులు తయారు చేసే బాధ్యత మీదేనా లేక మీకు ప్రత్యేక టీం ఏమైనా ఉందా వారు ఎవరు?.. అంటూ పలు ప్రశ్నలు సంధించారు. దాదాపు 120 ప్రశ్నలు సంధించగా భార్గవరెడ్డి మౌనంగా ఉన్నారని, మరికొన్నింటికి తెలియదని చెప్పారని సమాచారం.
ఫోన్లు ఎందుకు మార్చారు?
వైసీపీ అధికారంలో ఉండగా ప్రత్యర్థులపైనే పోస్టులు పెట్టాలనే ఆలోచన ఎవరిద ని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఆండ్రాయిడ్, ఐఫోన్లు, ల్యాప్‌టా్‌పలు, కం ప్యూటర్లు ఎక్కడున్నాయని, మొబైల్‌ఫోన్లు ఎందుకు మార్చాల్సి వచ్చిందని టెక్నికల్ బృందం భార్గవరెడ్డిని ప్రశ్నించింది. పదేపదే మొబైల్ ఫోన్లు మార్చలేదని కేవలం ఒక్క ఐఫోన్ మాత్రమే మార్చినట్లు సమాధానం చెప్పినట్లు తెలిసింది. రెండో రోజు కూడా సజ్జల భార్గవరెడ్డి తన న్యాయవాది ఓబులరెడ్డితో కలిసి విచారణకు హాజరయ్యారు.