పోలీసుల ముందుకు సజ్జల భార్గవ్‌రెడ్డి
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:50 AM
సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేశ్ కుటుంబసభ్యులపై పెట్టిన పోస్టులకు సంబంధించి నమోదైన కేసుల్లో వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్, ఏ-2 సజ్జల భార్గవ్‌రెడ్డిని పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.
చంద్రబాబు,లోకేశ్‌లపై అసభ్య పోస్టుల కేసుల్లో..
పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో 9 గంటలు సుదీర్ఘ విచారణ
అన్నీ దాటవేత సమాధానాలు
నేడు కూడా రావాలని పోలీసుల నోటీసు
పులివెందుల రూరల్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేశ్ కుటుంబసభ్యులపై పెట్టిన పోస్టులకు సంబంధించి నమోదైన కేసుల్లో వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్, ఏ-2 సజ్జల భార్గవ్‌రెడ్డిని పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. శనివారం ఉదయం న్యాయవాది ఓబుల్‌రెడ్డితో కలిసి ఆయన పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబు, లోకేశ్‌లపై వైసీపీకి చెందిన వర్రా రవీంద్రరెడ్డి పెట్టిన అనుచిత పోస్టులను రూపొందించింది భార్గవ్‌రెడ్డే అనేది ప్రధాన అభియోగం. దీనిని ప్రశ్నించిన వ్యక్తిని కులం పేరుతో దూషంచారని మరో ఫిర్యాదు అందడంతో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులకు సంబంధించే ఆయన శనివారం విచారణకు హాజరయ్యారు. దాదాపు 9 గంటల పాటు విచారణ సాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు దాటవేసే సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం మళ్లీ విచారణకు రావాలని పోలీసులు నోటీసులిచ్చారు. అనంతరం పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ విలేకరులతో మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేశారని చెప్పారు. సోషల్ మీడియా పోస్టులకు వాడిన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌లు ఇవ్వాలని కోరామని.. కోర్టు ద్వారా వస్తే ఇస్తామని ఆయన చెప్పారని తెలిపారు.