సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఎల్‌వోసీ జారీ అయింది
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:32 AM
అభ్యంతర పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను కోరినట్లు అన్నమయ్య జిల్లా ...
అన్నమయ్య ఎస్పీ అదనపు అఫిడవిట్
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): అభ్యంతర పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను కోరినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇటీవల దాఖలుచేసిన అఫిడవిట్‌లో ఎల్‌వోసీ జారీకి ఎలాంటి అభ్యర్థన చేయలేదని తప్పుగా పేర్కొన్నామని, దానిని సవరించుకుంటూ అదనపు అఫిడవిట్ వేస్తున్నామని పేర్కొన్నారు. భార్గవ్‌రెడ్డిపై ఎల్‌వోసీ జారీ చేయాలని తనకంటే ముందు ఎస్పీగా చేసిన విద్యాసాగర్ నాయుడు 2024 నవంబరు 7న సీఐడీ అదనపు డీజీకి అభ్యర్థన చేశారన్నారు. తనపై ఎల్‌వోసీని రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవ్‌రెడ్డి గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా భార్గవరెడ్డిపై ఎల్‌వోసీ జారీ చేయాలని తాము కోరలేదని అన్నమయ్య జిల్లా ఎస్పీ కౌంటర్‌లో పేర్కొన్నారు. అయితే అన్నమయ్య జిల్లా ఎస్పీ, సీఐడీ అదనపు డీజీ కోరిన మీదటే భార్గవరెడ్డిపై ఎల్‌వోసీ జారీ చేశామని అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ నివేదించారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు తదుపరి విచారణ నాటికి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.