కేసు సీబీఐకి అప్పగించండి
ABN , Publish Date - Jun 27 , 2026 | 04:07 AM
తన కుమారుడు గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంలో నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు చేసేందుకు కోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు కేసు విచారణను అప్పగించాలని..
లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వండి
వాస్తవాలు తొక్కిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు
మొత్తం వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్ర ఉంది
హైకోర్టులో సాయికృష్ణ తల్లి అనుబంధ పిటిషన్
అమరావతి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): తన కుమారుడు గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంలో నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు చేసేందుకు కోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు కేసు విచారణను అప్పగించాలని కోరుతూ తల్లి గాదె విజయలక్ష్మి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలుచేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్ర ఉందని, వాస్తవాలను తొక్కిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పోలీస్ యంత్రాంగంతో సంబంధంలేని స్వతంత్ర సంస్థకు కేసు దర్యాప్తును అప్పగించాలని అభ్యర్థించారు. సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరిచేలా విజయవాడ కృష్ణలంక పోలీసులను ఆదేశించాలని కోరుతూ విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ 29న విచారణకు రానుంది. ఈ పిటిషన్‌లో తాజాగా అనుబంధ పిటిషన్ వేశారు. ‘నా కుమారుడి అదృశ్యంపై మే 28న విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ జూన్ 19వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. ఈ జాప్యం దర్యాప్తు విశ్వసనీయతపై అనుమానాలు కలిగిస్తోంది. నా కుమారుడిని కనిపెట్టేందుకు సిట్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అదృశ్యానికి గల కారణాలు, దర్యాపు పురోగతిపై కౌంటర్ దాఖలు చేయలేదు. అక్రమంగా నిర్బంధించి, కస్టోడియల్ టార్చర్‌కు గురిచేసిన తరువాతే నా కుమారుడు అదృశ్యమయ్యాడు. సీఐ నాగరాజు విషయంలో సిట్ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టును పరిశీలిస్తే.. మే 6న సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చినప్పటికీ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టలేదు. ఆచూకీ తెలియలేదని, మృతదేహం లభించలేదు. సీసీ ఫుటేజ్ కూడా లేదని రిపోర్టులో పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. తన పరిధిలో ఇంత పెద్ద నేరం జరిగినప్పటికీ తనకు ఏమీ తెలియదన్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ వ్యవహరిస్తున్నారు’ అని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు.