అ‘దృశ్యం’ ఎలా?
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:27 AM
‘రౌడీషీటర్ గాదె సాయికృష్ణను ఏం చేశారు? ఎక్కడున్నాడు? అసలు ఆ రోజు స్టేషన్‌లో ఏం జరిగింది? ఈ అదృశ్య ఘటనలో మీ పాత్ర ఏమిటి?’.. ఇన్‌స్పెక్టర్ నాగరాజుకు..
సిట్ అదుపులో సీఐ నాగరాజు స్నేహితుడు సురేశ్
సాయికృష్ణ కేసులో సుదీర్ఘంగా విచారణ
నాగరాజుతో స్నేహం ఎలా ఏర్పడిందని ఆరా
టాస్క్‌ఫోర్స్ సిబ్బందినీ విచారించిన సిట్
ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు కృష్ణలంక పీసీ బాబూరావుకు ప్రశ్నలవర్షం
ఇంకా ఆచూకీలేని హెచ్‌సీలు అశోక్, నాని
విజయవాడ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ‘రౌడీషీటర్ గాదె సాయికృష్ణను ఏం చేశారు? ఎక్కడున్నాడు? అసలు ఆ రోజు స్టేషన్‌లో ఏం జరిగింది? ఈ అదృశ్య ఘటనలో మీ పాత్ర ఏమిటి?’.. ఇన్‌స్పెక్టర్ నాగరాజుకు సన్నిహితుడిగా ముద్రపడిన సురేశ్‌ను సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు ఇవీ. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో ఇన్‌స్పెక్టర్ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేసిన తర్వాత స్టేషన్‌లో పనిచేసే హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, నానితో పాటు సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సురేశ్‌ను సిట్ బృందాలు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశాయని తెలిసింది. అతడిని పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. నాగరాజుతో స్నేహం ఎలా ఏర్పడిందని ప్రశ్నలు మొదలుపెట్టిన అధికారులు.. సాయికృష్ణ అదృశ్యం వరకు అడిగారు. కొన్నింటికి మాత్రమే సురేశ్ జవాబులు ఇచ్చినట్టు సమాచారం. సాయికృష్ణ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని చెప్పినట్టు తెలిసింది. దీని గురించి ఏమీ తెలియనప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోవాల్సిన అవసరం ఏముందని సిట్ అధికారులు వేసిన ప్రశ్నలకు మౌనమే సమాధానమైంది. అజ్ఞాతంలో ఉన్న హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, నాని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. విధులకు గైర్హాజరైనందుకు వీరిద్దరినీ సస్పెండ్ చేశారు.
మార్కాపురం నుంచి ఎందుకు తీసుకొచ్చారు?
మార్కాపురం నుంచి సాయికృష్ణను ఎందుకు తీసుకొచ్చారన్న అంశంపై టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో పాటు కృష్ణలంక స్టేషన్ కానిస్టేబుల్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ నవీన్, కానిస్టేబుళ్లు కృష్ణ, రాంబాబుతో పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్ల బాధ్యతలను చూసే బాబూరావును సిట్ అధికారులు పిలిపించారు. ఈ నలుగురు మే ఐదో తేదీన మార్కాపురం వెళ్లారు. సాయికృష్ణపై మొత్తం 3 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెడింగ్‌లో ఉన్నాయని వారు వివరించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో రెండు, మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఒక ఎన్‌బీడబ్ల్యూ పెండింగ్‌లో ఉన్నాయని చెప్పినట్టు తెలిసింది. కృష్ణలంకలో సాయికృష్ణపై నమోదైన క్రైం నంబర్లు 527/2019, 350/2024 కేసుల్లో కోర్టు ఎన్‌బీడబ్ల్యూలు జారీ చేసిందని వివరించారు. మాచవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నంబరు 34/2021లో మరో ఎన్‌బీడబ్ల్యూ పెండింగ్‌లో ఉందని తెలిపారు. కృష్ణలంకలో పెండింగ్‌లో ఉన్న రెండు ఎన్‌బీడబ్ల్యూలను అమలు చేయడానికి సాయికృష్ణను తీసుకొచ్చినట్టు వివరించారు.
ఆత్మహత్య సెల్ఫీ వీడియోపైనా విచారణ
విజయవాడ ఫకీర్‌గూడేనికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు పేరిపోగు వెంకటేశ్వరరావు కుమారుడు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు చిత్రీకరించుకున్న సెల్ఫీ వీడియో పైనా విచారణ జరుగుతున్నట్టు తెలిసింది. క్రాంతికుమార్‌పై కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో క్రైం సస్పెక్ట్ షీట్ ఉంది. అదే స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ సురేశ్‌తో కలిసి పీఎన్‌బీఎస్ ఎదురుగా ఉన్న బార్‌లోకి వెళ్లి మద్యం తాగి గొడవ చేశాడు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. కానిస్టేబుల్ సురేశ్‌పై మాత్రం శాఖాపరంగా చర్యలు తీసుకున్నారు. విధుల నుంచి సస్పెండ్ చేశారు. క్రాంతికుమార్ మే నెలలో ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో నాగరాజు వేధింపుల వల్ల చనిపోతున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. సాయికృష్ణ అదృశ్యంపై నాగరాజును సస్పెండ్ చేసిన తర్వాత క్రాంతికుమార్ వీడియో బయటకు వచ్చింది. దీనిపైనా సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.