Share News

సాయికృష్ణ అదృశ్యంపై సీఎం సీరియస్‌

ABN , Publish Date - Jun 18 , 2026 | 02:57 AM

విజయవాడలోని కృష్ణలంక పోలీసు స్టేషన్‌ పరిధిలో గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు.

సాయికృష్ణ అదృశ్యంపై సీఎం సీరియస్‌

  • సింగపూర్‌ నుంచి రాగానే ఉప ముఖ్యమంత్రి, సీఎస్‌, డీజీపీ, నిఘా చీఫ్‌, కమిషనర్‌తో భేటీ

  • సీఐ నాగరాజును వీఆర్‌కు పంపామన్న డీజీపీ

  • తక్షణం సస్పెండ్‌ చేయాలని నిర్ణయం

  • సీనియర్‌ ఐపీఎ్‌సతో విచారణకు ఆదేశం

  • దర్యాప్తు అధికారిగా రాజమండ్రి ఎస్పీ

  • సాయికృష్ణ, సీఐ ఒకే కులంవారు

  • అయినా ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రతి విషయానికీ కులం రంగు

  • ఇలాంటి శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం

  • సాయికృష్ణపై 22 కేసులు, రౌడీషీట్‌..

  • గత డిసెంబరులో స్నేహితుడిని చంపి

  • జగ్గయ్యపేట ఆస్పత్రిలో పడేసిన వైనం

  • అరెస్టుచేసి జైలుకు పంపిన పోలీసులు

  • బెయిల్‌పై వచ్చాక మార్కాపురం పయనం

  • అక్కడి నుంచి కృష్ణలంక పోలీసులే తీసుకొచ్చి చంపేశారంటున్న తల్లి

  • హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌

  • ఆచూకీ కోసం పది ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామన్న పోలీసు కమిషనర్‌

  • కోర్టు విచారణ ఈ నెల 29కి వాయిదా

అమరావతి/విజయవాడ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): విజయవాడలోని కృష్ణలంక పోలీసు స్టేషన్‌ పరిధిలో గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. లాకప్‌ డెత్‌ అని.. సాయికృష్ణను పోలీసులు కొట్టి చంపారంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీయాలని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను ఆదేశించారు. సింగపూర్‌ పర్యటన ముగించుకుని బుధవారం మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వెంటనే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, సీఎస్‌ సాయిప్రసాద్‌, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మహేశ్‌చంద్ర లడ్డా, విజయవాడ పోలీసు కమిషనర్‌ రాజశేఖర్‌బాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, సాయికృష్ణ అదృశ్యం, లాకప్‌ డెత్‌ ఆరోపణలు, వాటి వెనకున్న శక్తులు, కుల చిచ్చుకు జరుగుతున్న కుట్రలు, ఇతర పరిణామాలపై చర్చించారు. కేసులో పురోగతి, పోలీసుల పాత్ర, వాస్తవాలపై అఽధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. డీజీపీ బదులిస్తూ.. కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్‌కు పంపామని చెప్పారు.


ఘటన తీవ్రత దృష్ట్యా సీఐని తక్షణమే సస్పెండ్‌ చేయాలని భేటీలో నిర్ణయించారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారితో నిష్పక్షపాత విచారణ జరిపించి వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలని సీఎం స్పష్టంచేశారు. ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించబోనని, శాఖాపరమైన, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారానికి కులం రంగు పులిమి శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులను ఎలా ఎదుర్కోవాలనే విషయమై ఉపముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చర్చించినట్లు సమాచారం. అదృశ్యమైన సాయికృష్ణ, ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ ఒకే కులానికి చెందినవారే అయినా.. ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రతి విషయాన్నీ కులం వైపు తీసుకెళ్తున్న శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఈ సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి సూచించారు. కాగా.. సీఐ నాగరాజును మూడ్రోజుల కిందటే విజయవాడ కమిషనరేట్‌ నుంచి ఏలూరు రేంజ్‌కు బదిలీ చేశారు. ఏలూరు ఐజీ అశోక్‌కుమార్‌ ఆయన్ను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. మరోవైపు.. సాయికృష్ణ అదృశ్యంపై సీనియర్‌ ఐపీఎ్‌సతో విచారణకు సీఎం ఆదేశించారు. తక్షణమే రాజమండ్రి ఎస్పీ నరసింహ కిశోర్‌ను దర్యాప్తు అధికారిగా నియమించారు.


ఎవరీ సాయికృష్ణ?

కృష్ణలంకలోని రాజీవ్‌నగర్‌కు చెందిన గాదె సాయికృష్ణ అలియాస్‌ పిల్ల సాయిపై మొత్తం 22 కేసులు ఉన్నాయి. వీటిలో గుంటూరు జిల్లా తాడేపల్లి, తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసు స్టేషన్లలో నమోదైనవి కూడా ఉన్నాయి. పోక్సో కేసు సహా కొన్ని కేసుల్లో కోర్టు శిక్షలు విధించింది. కొన్ని కేసులు లోక్‌ అదాలత్‌లో రాజీ అయ్యాయి. అతడిపై ప్రస్తుతం మూడు కేసులు కోర్టు విచారణలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక నాగరాజును కృష్ణలంక సీఐగా నియమించారు. రౌడీషీటర్లు, నేరగాళ్లపై ఆయన కఠినంగా వ్యవహరించడంతో సాయికృష్ణ హైదరాబాద్‌కు మకాం మార్చాడు. కొన్నాళ్లకు చిల్లకల్లు చేరుకుని ఓ గది అద్దెకు తీసుకుని అక్కడ పార్టీలు నిర్వహించుకునేవాడు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబరు 4వ తేదీ రాత్రి ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరపుతండా శివారులో స్నేహితులతో మందు పార్టీ చేసుకుంటున్న సమయంలో మాటమాటా పెరిగి.. విజయవాడ ఊర్మిళానగర్‌కు చెందిన మిత్రుడు అలవల నవీన్‌ అలియాస్‌ నవీన్‌రెడ్డిని సాయికృష్ణ బీరుసీసా పగలగొట్టి కిరాతకంగా పొడిచి చంపాడు. తర్వాత అతడి మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రి ఆవరణలో పడేసి పారిపోయాడు. ఈ హత్యపై చిల్లకల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి జైలుకు తరలించారు. కొద్ది నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఉపాధి కోసమంటూ మార్కాపురం వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అక్కడి నుంచి కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి లాక్‌పలో చంపేశారని అతడి తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. తన కుమారుడిని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశించాలని ఆమె హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సాయికృష్ణ అదృశ్యంపై పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసు కమిషనర్‌ రాజశేఖర్‌బాబు హైకోర్టుకు తెలియజేశారు. దీనిపై విచారణ ఈ నెల 29వ తేదీకి వాయిదా పడింది.

Updated Date - Jun 18 , 2026 | 03:01 AM