సాయికృష్ణ కేసులో మా దర్యాప్తు అక్కర్లేదు
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:21 AM
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపేంత కేసు కాదని హైకోర్టుకు సీబీఐ నివేదించింది.
అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపేంత కేసు కాదు
ఇప్పటికే ఐజీ పర్యవేక్షణలో ‘సిట్’ విచారణ.. మాకు బదిలీ చేయాలని భావిస్తే
సిబ్బంది, సహకారం అందించేలా ఆదేశించండి.. హైకోర్టులో సీబీఐ కౌంటర్
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపేంత కేసు కాదని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. గాదె సాయికృష్ణ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐజీ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తోందని గుర్తు చేసింది. ఒకవేళ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోర్టు భావిస్తే, దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని, ఇతర సహాయ, సహకారాలను అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించింది. గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్టిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విశాఖపట్నం సీబీఐ డీఎస్పీ సంజయ్‌కుమార్ సమల్ ఇటీవల కౌంటర్ దాఖలు చేశారు. ‘అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి. లేనిపక్షంలో ఆ సంస్థపై కేసుల భారం పెరిగి, పరిమిత వనరులతో తీవ్రమైన కేసులను కూడా సరిగా దర్యాప్తు చేయలేక విశ్వసనీయత కోల్పోతుంది’ అని ఓ కేసు విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమల్ ప్రస్తావించారు. కేవలం నిందితుడి అసంతృప్తి, పోలీసులపై నిరాధారమైన ఆరోపణలు ఆధారంగా చేసుకొని దర్యాప్తును సీబీకి బదిలీ చేయడానికి వీల్లేదని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొందని తెలిపారు.ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పిల్‌లో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.