Share News

సీబీఐ దర్యాప్తు కోరలేదు

ABN , Publish Date - Jul 15 , 2026 | 04:34 AM

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు బాధ్యతలను కోర్టు పర్యవేక్షణలో..

సీబీఐ దర్యాప్తు కోరలేదు

  • పిటిషన్‌ వేయాలని నేనెవరికీ చెప్పలేదు.. ఆ వ్యాజ్యంతో సంబంధం లేదు

  • ఉపసంహరణకు అనుమతించండి.. హైకోర్టుకు సాయికృష్ణ తల్లి అభ్యర్థన

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు బాధ్యతలను కోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్‌ గురించి తనకు సమాచారం లేదని అతడి తల్లి గాదె విజయలక్ష్మి హైకోర్టుకు తెలిపారు. ఆ పిటిషన్‌ దాఖలు చేయాలని తానెవరికీ సూచించలేదని, అలాంటి అధికారం ఎవరికీ ఇవ్వలేదని.. ఆ పిటిషన్‌తో తనకు సంబంధం లేదని, దానిపై వాదనలు వినిపించేందుకు ఆసక్తి లేదని పేర్కొంటూ తాజాగా మరో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. తన కుమారుడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లో తాను చేసిన అభ్యర్థన నిరర్థకంగా మారిందని.. అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు. తన కుమారుడు సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలని కోరుతూ విజయలక్ష్మి హైకోర్టులో గతంలోనే హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు దర్యాప్తు బాధ్యతలు ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ కూడా ఆమె తరఫున దాఖలైన విషయం తెలిసిందే.

Updated Date - Jul 15 , 2026 | 04:36 AM