Share News

మోడల్‌కాలనీగా సాగర్‌నగర్‌ అభివృద్ధి

ABN , Publish Date - Apr 05 , 2026 | 04:44 AM

సాగర్‌నగర్‌ను మోడల్‌ కాలనీగా అభివృద్ధి చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని సాగర్‌నగర్‌లో నిర్వహించిన...

మోడల్‌కాలనీగా సాగర్‌నగర్‌ అభివృద్ధి

  • సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ

  • అన్నీ పరిష్కరించాక విజయోత్సవం నిర్వహిద్దాం

  • ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా

  • సాగర్‌నగర్‌లో విజయవంతంగా ‘అక్షరం అండగా..’ కార్యక్రమం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): సాగర్‌నగర్‌ను మోడల్‌ కాలనీగా అభివృద్ధి చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని సాగర్‌నగర్‌లో నిర్వహించిన ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైతే సాగర్‌నగర్‌ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఐటీ సెజ్‌ను ఆనుకుని, టూరిజం హబ్‌గా ఉన్న సాగర్‌నగర్‌ను భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుందనే దానిపై ఆలోచన చేస్తున్నానన్నారు. సాగర్‌నగర్‌లో రోడ్ల విస్తరణ, నీటి సరఫరా, డ్రైనేజీ సదుపాయం మెరుగుపరచడం, శ్మశాన వాటికలు, పార్కుల నిర్వహణ మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం రూ.23 కోట్లతో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నాయన్నారు. సదస్సులో ప్రస్తావించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు అధికారులతో కలిసి చర్చించి సమగ్ర కార్యాచరణ రూపొందిస్తానని చెప్పారు. ‘ఆంధ్రజ్యోతి’ సంస్థ నిర్వహించిన ఈ సదస్సు సమస్యల పరిష్కారానికి ఒక ఆరంభమని అన్నారు. సదస్సులో ప్రస్తావించిన సమస్యలన్నింటినీ పరిష్కరించిన తర్వాత ఇదే వేదికపై విజయోత్సవ సభ నిర్వహించాలని ‘ఆంధ్రజ్యోతి’ బ్రాంచి మేనేజర్‌ కె.రామకృష్ణారావుకు సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాల బాధ్యతను గుర్తుచేసి, ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చి, వాటిని పరిష్కరించేలా చేయడంలో మీడియా పాత్ర కీలకమని, ఆ బాధ్యతను ‘ఆంధ్రజ్యోతి’ యాజమాన్యం ఆచరణలో పెడుతున్నందున ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 04:45 AM