బాబోయ్ పాములు!
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:29 AM
‘స్నేక్స్ ఆన్ ఏ ప్లేన్’... 20 ఏళ్ల కిందట వచ్చిన హాలీవుడ్ సినిమా ఇది! అందులో... విమానం నిండా పాములే! అది సినిమా! ఇప్పుడు విశాఖకు చేరుకున్న ఒక నౌకలో నిజంగానే పెద్దసంఖ్యలో పాములు..
‘సాగర కన్య’ నౌకలో విష సర్పాలు
మరమ్మతుల కోసం అండమాన్ నుంచి విశాఖకు
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)
‘స్నేక్స్ ఆన్ ఏ ప్లేన్’... 20 ఏళ్ల కిందట వచ్చిన హాలీవుడ్ సినిమా ఇది! అందులో... విమానం నిండా పాములే! అది సినిమా! ఇప్పుడు విశాఖకు చేరుకున్న ఒక నౌకలో నిజంగానే పెద్దసంఖ్యలో పాములు కనిపిస్తున్నాయి. ఆ నౌక పేరు ‘సాగర కన్య’! కాలపరిమితి ముగియడంతో దాన్ని అండమాన్‌లోని జట్టీలో వదిలేశారు. ఓ వ్యాపారి దాన్ని తిరిగి తిప్పాలనే ఆలోచనతో కొనుగోలు చేసి.. మరమ్మతుల నిమిత్తం విశాఖ షిప్‌యార్డుకు తీసుకువచ్చారు. మరమ్మతుల కోసం కార్మికులు లోపలికి వెళ్లగా.. విష సర్పాలు బుసలు కొడుతూ కనిపించాయి. దీంతో వారంతా బయటకు పరుగెత్తారు. పాములున్న నౌకలో పనిచేయలేమని చేతులెత్తేశారు. నౌక యాజమాన్యం ఎవరైనా పాములన్నింటినీ పట్టేస్తే రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించినా.. ఎవరూ ముందుకు రాలేదు. దీంతో... నాలుగు నెలలుగా ‘సాగర కన్య’ మరమ్మతులకు బ్రేక్ పడింది. షిప్‌యార్డు ఉద్యోగుల నుంచి ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక స్నేక్ క్యాచర్ నాగరాజు రెండు రోజుల క్రితం నౌకలోకి వెళ్లి ఒక కొండచిలువతో పాటు మూడు, నాలుగు పాములను పట్టుకొచ్చారు. నౌకలో ఇంకా విషపూరిత పాములు ఉండొవచ్చని, నౌక మొత్తం తనిఖీ చేశాకే మరమ్మతులు పనులు చేపట్టాలని సూచించారు.