సాధిక్ ఎక్కడ?
ABN , Publish Date - Aug 20 , 2026 | 03:26 AM
పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన షేక్ సాధిక్‌ఖాన్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు
ఆచూకీ కోసం జల్లెడ పడుతున్న పోలీసు బృందాలు
తెలంగాణ, కర్ణాటక, ముంబైల్లో విస్తృతంగా గాలింపు
ఫోన్‌కాల్స్, చాటింగ్, వాయిస్ కాల్స్ డేటా సేకరణ
కాకినాడ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన షేక్ సాధిక్‌ఖాన్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఆంధ్రతో పాటు తెలంగాణ, కర్ణాటక, ముంబైల్లో ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నాయి. కాకినాడలోని అశోక్‌నగర్‌లో నూకరాజు నివాసం ఉంటున్న సాయి శ్రీనివాస్ అపార్ట్‌మెంట్‌కు ఆదివారం సాయంత్రం కూడా సాధిక్ పలుమార్లు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. అదేరోజు రాత్రి నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చే సమయానికే సాధిక్ కాకినాడ దాటి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. సాధిక్‌కు, నూకరాజు కుటుంబ సభ్యులకు మధ్య కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. అతను ఫోన్ చేసినా వారు లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా ఇంటికి వచ్చినట్టు సమాచారం.
కీలకంగా కాల్ డేటా రికార్డు
ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీ నిర్వాహకుడు సాధిక్ ఆచూకీ కోసం అతని ఇంటిపైన, కుటుంబ సభ్యుల కదలికలపైనా పోలీసులు కన్నేసి ఉంచారు. అతని స్నేహితులు, బంధువులు, సన్నిహితంగా ఉండేవారి వివరాలు ఆరా తీస్తున్నారు. నిందితుడి కాల్ డేటాతో పాటు, వాట్సప్ చాటింగ్, సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా బుధవారం సాధిక్ స్నేహితులు, వారి తల్లిదండ్రులు కొందరిని పోలీసు స్టేషన్‌కు పిలిచి విచారించినట్టు తెలిసింది. అలాగే నూకరాజు, ఆయన భార్య, కుమార్తె సౌజన్య ఫోన్‌కాల్ లిస్టులు, వాట్సప్ చాటింగ్, వాయిస్ కాల్స్ డేటాను సేకరిస్తున్నారు. కొద్ది నెలల కిందట నూకరాజు ఓ పోలీస్ స్టేషన్లో సాధిక్‌పై ఫిర్యాదు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే అది ఎక్కడ, ఎవరికి చేశారనే విషయాలు తెలియాల్సి ఉంది.
లవ్ జిహాదీ కోణం?
నూకరాజు వియ్యంకుడు భాస్కరరెడ్డి మంగళవారం సర్పవరం పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో.. తన కోడలిని ముస్లిం మతంలోకి మారాలని సాధిక్ తీవ్ర ఒత్తిడి చేశాడని, ఇస్లాం చదవాలని, నమాజు చేయాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించేవాడని పేర్కొనడంతో లవ్ జిహాదీ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సాధిక్‌ఖాన్‌ది దూకుడు స్వభావమని, గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా పనిచేసినట్టుగా ప్రచారం సాగుతోంది.
గోదావరిలో మృతదేహాల కోసం గాలింపు
నూకరాజు కుటుంబం గోదావరిలో దూకిన ఘటనలో ఇప్పటివరకు నూకరాజు మృతదేహం మాత్రమే లభించింది. ఆయన భార్య మీనా, కూతురు సౌజన్య జాడ కోసం బుధవారం కూడా ముమ్మరంగా గాలించినా ఫలితం లేకపోయింది. గోదావరిలో మిగులు జలాలను సుమారు 98 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. 46వ గేటు నుంచి మృతదేహం వంటిది వెళ్లినట్టు మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేయడంతో జొన్నాడ తదితర ప్రాంతాల వరకూ పోలీసులు పరిశీలించినా ఆచూకీ లభించలేదు. నూకరాజు మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి సంబంధీకులకు పోలీసులు అప్పగించారు.