పశ్చాత్తాపం లేదు భయం లేదు
ABN , Publish Date - Aug 24 , 2026 | 03:31 AM
ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యాడు. అతడి వేధింపులు భరించలేక నదిలోకి దూకి ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు.
సాదిక్ క్రూరత్వం!
పోలీసుల ప్రశ్నలకు తలబిరుసు సమాధానాలు
ఢిల్లీ నుంచి కాకినాడకు తీసుకొచ్చిన పోలీసులు
రైల్లో తీసుకొస్తూనే ప్రశ్నించిన సిబ్బంది
నేడు సర్పవరం పోలీసు స్టేషన్లో విచారణ
సాయంత్రం కోర్టులో హాజరుపరిచే అవకాశం
కాకినాడ, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యాడు. అతడి వేధింపులు భరించలేక నదిలోకి దూకి ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కొంతకాలం క్రితం ఆ కుటుంబ అల్లుడిని హత్య చేశాడనే ఆరోపణలూ ఉన్నాయి. పాపం.. ఇప్పుడు ఆ కుటుంబంలో మిగిలింది ఓ బాలుడు మాత్రమే. ఇంత దారుణం జరిగినా తప్పు చేశాననే పశ్చాత్తాపం నిందితుడిలో ఏమాత్రం లేదు. కించిత్ భయం కూడా లేదు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తలబిరుసు సమాధానాలు. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్‌ఖాన్ క్రూరత్వం ఇదీ. నిందితుడిని ఢిల్లీలో పట్టుకున్న పోలీసులు ఏపీ ఎక్స్‌ప్రె్‌సలో సామర్లకోట రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక భద్రత నడుమ ఆదివారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో కాకినాడ సర్పవరం పోలీసుస్టేషన్‌కు తరలించారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సోమవారం ఉదయం నుంచి సాదిక్‌ను విచారించిన అనంతరం సాయంత్రం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్టు తెలిసింది. తదుపరి విచారణ కోసం నిందితుడి కస్టడీకి కోరనున్నట్లు సమాచారం. సాదిక్ వేధింపుల వల్లే తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుందని ఏఈ నూకరాజు సూసైడ్ నోట్‌లో రాయడం, అలాగే సాదిక్ తమను ఏ విధంగా వేధించిందీ నూకరాజు కుమార్తె సౌజన్య సైతం మరో నోట్ రాసిన విషయం తెలిసిందే. తన కుమారుడు జగదీశ్వరరెడ్డిని సాదిక్ హతమార్చినట్టుగా చెబుతూ అతని తండ్రి, నూకరాజు వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీటన్నింటిపైనా పోలీసులు సాదిక్‌ను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే సాదిక్‌కు ఏం ప్రశ్నలు సంధించాలి? అతని నుంచి ఏయే వివరాలు రాబట్టాలి? అనే విషయంలో పోలీసులు కసరత్తు పూర్తి చేసినట్టు తెలిసింది. సాదిక్‌ను మీరట్‌లో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి.. అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకొచ్చినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
నాకేం సంబంధం లేదు..: ఢిల్లీ నుంచి రైలులో తీసుకొస్తున్న సమయంలోనే సాదిక్‌ను పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే అతడిలో ఎటువంటి భయం కనిపించలేదని, నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనా.. పశ్చాత్తాపం కనిపించకపోగా.. పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు తలబిరుసు సమాధానాలిచ్చినట్టు సమాచారం. ‘నూకరాజు కుటుంబాన్ని వేధించి, ఆయన కుమార్తెను చిత్రహింసలు పెట్టి కుటుంబమంతా ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి ఎందుకు తెచ్చావ్?’ అని పోలీసులు ప్రశ్నించగా.. సాదిక్ నోరు మెదపలేదని.. పైగా తనకు, నూకరాజు కుటుంబానికి మధ్య ఉన్న సంబంధానికి చెందిన వీడియోలను పోలీసులకు చూపించినట్టుగా తెలిసింది. తాను ఏమీ మాట్లాడబోనని, ఈ వీడియోలే ప్రత్యక్ష సాక్ష్యాలని అన్నట్టు సమాచారం. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి మృతిలో నీ పాత్ర ఏమిటి? అని పోలీసులు ప్రశ్నించగా.. తనకేం సంబంధం లేదని, అతను అనారోగ్యంతో మృతిచెందినట్టు మాత్రమే తెలుసని, నూకరాజు కుటుంబసభ్యులే అతనికి ఏవో ట్యాబ్లెట్లు ఇచ్చేవారని సాదిక్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. చాలా ప్రశ్నలకు మౌనమే సమాధానంగా సాదిక్ వ్యవహరించినట్టు చెప్తున్నారు. అలాగే సౌజన్య కుమారుడు రియాన్స్ కార్తికేయరెడ్డిని చంపుతానని ఎందుకు బెదిరించావన్న ప్రశ్నకు.. తన మాట విననందుకు, అలా అనాల్సి వచ్చిందని సమాధానమిచ్చాడు. ఒకానొక దశలో సౌజన్యను కూడా గన్‌తో కాల్చి చంపేస్తానని సాదిక్ బెదిరించాడని కూడా సమాచారం. ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సాదిక్ పోలీసులతో వాదనలకు దిగినట్టు తెలిసింది. అలాగే సాదిక్ కొంత కాలం కిందట కొనుగోలు చేసిన ఖరీదైన రెండు కార్లుపైనా పోలీసులు ఆరా తీశారు. అవి ఎక్కడ ఉన్నాయి? ఎవరి పేరిట ఉన్నాయని ప్రశ్నించారు. దానికి కూడా సాదిక్ సరైన సమాధానం ఇవ్వలేదని అంటున్నారు.