Share News

శబరిమల విశిష్టతను కాపాడుకోవాలి

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:34 AM

శబరిమల విశిష్టతను కాపాడటానికి ప్రతి హిందువు పోరాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

శబరిమల విశిష్టతను కాపాడుకోవాలి

  • ఈ పోరాటానికి ప్రతి హిందువు కలసి రావాలి: మాధవ్‌

విజయవాడ అర్బన్‌, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): శబరిమల విశిష్టతను కాపాడటానికి ప్రతి హిందువు పోరాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం శబరిమల యాత్రలో ఏపీ అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి మాధవ్‌ మాట్లాడుతూ ఒకవైపు అన్యమతస్థులు, మరోవైపు నాస్తికులు హిందూ ధర్మంపై దాడి చేస్తున్నారని తెలిపారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు శబరిమల లేకుండా చేయటానికి కోర్టులకు వెళ్లాయని అన్నారు. శబరిమలలో మహిళల ప్రవేశంపై రాద్ధాంతం చేశారని, 2006లో కోర్టులో కేసు వేశారని తెలిపారు. కేరళంలో అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వం దేశ వ్యతిరేక శక్తులతో కలసి కుట్రలు చేసిందని, శబరిమలలో బంగారాన్ని దోచుకోవాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల కోసం కేంద్రం న్యాయపోరాటం చేస్తోందని, అందుకు ప్రతి హిందువు కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో కూటమి ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. టీటీడీ తరహా వ్యవస్థను శబరిమలలోనూ ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చే ఏడాదిలోపు శబరిమలలో అయ్యప్ప స్వాములు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించటానికి ప్రయత్నిస్తామని మాధవ్‌ హామీ ఇచ్చారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌ మాట్లాడుతూ కేరళలో భక్తులు పడుతున్న బాధలు తాను కూడా అనుభవించానని చెప్పారు. ఆ రాష్ట్రంలో తెలుగు స్వాములు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో తాళ్లాయపాలెం పీఠాధిపతి శివస్వామి, పలువురు స్వామీజీలు, పీఠాధిపతులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 06:35 AM